Gram Water : శనగల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని కూరల్లో వేస్తుంటారు. పలు రకాల ఆహారాలను కూడా వండుతుంటారు. వీటిని నీటిలో నానబెట్టి ఉడికించి తినవచ్చు. అలాగే పెనంపై కొద్దిగా వేయించి కూడా తినవచ్చు. శనగలను తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. అయితే శనగలను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని పరగడుపునే తాగాలి. ఇలా తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. శనగలను నానబెట్టిన నీటిని తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శనగలను నానబెట్టిన నీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. వాటిల్లో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్లు ఎ, బి, సి, డిలు ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. శనగలను నానబెట్టిన నీటిని రోజూ పరగడుపునే తాగితే అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వారు ఈ నీటిని తాగితే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
3. అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజూ శనగలను నానబెట్టిన నీళ్లను తాగాలి. దీంతో అలసట అనేది రాదు. శక్తి లభిస్తుంది. ఎంత పనిచేసినా అలసిపోరు. జీర్ణాశయం నిండినట్లు అనిపిస్తుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలివేయదు. ఫలితంగా బరువు తగ్గడం తేలికవుతుంది.
4. మలబద్దకం ఉన్నవారు ఈ నీళ్లను తాగితే ఎంతో ఉపశమనం లభిస్తుంది. సుఖ విరేచనం అవుతుంది. అలాగే గ్యాస్, అజీర్ణం కూడా తగ్గుతాయి.
5. శనగలను నానబెట్టిన నీళ్లను తాగితే చర్మం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. దీంతో చర్మ సమస్యలు తగ్గుతాయి.
రాత్రి పూట ఒక గిన్నెలో నీళ్లను పోసి అందులో గుప్పెడు శనగలను వేయాలి. రాత్రంతా వాటిని నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. లేదా కొద్దిగా మరిగించి తాగవచ్చు. నీళ్లను మరిగిస్తే అందులో కొద్దిగా జీలకర్ర పొడి, ఉప్పు, నిమ్మరసం కలిపి తాగాలి. దీంతో మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయి.