మహిళలు ప్రతిరోజూ 3 కప్పుల టీ తాగుతూంటే గుండె సంబంధిత వ్యాధులు, గుండె పోట్లు రావని ఒక పరిశోధనలో కనుగొన్నారు. ఒక ఫ్రెంచి పరిశోధన మేరకు ప్రతి రోజూ 3 కప్పుల టీ తాగితే మహిళలకు రక్తనాళాలలో కొవ్వు, కొల్లెస్టరాల్ మొదలైనవి గడ్డలు కట్టి అడ్డంకులు ఏర్పడవని, ఈ కారణంగా వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా వుంటుందని వెల్లడైంది.
ఈ పరిశోధన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ డి లా శాంటి ఎట్ డిలా రీసెర్చ్ లో చేశారని ది డైలీ మెయిల్ వార్తా పత్రిక కధనంగా ప్రచురించింది. అయితే, ప్రతి రోజూ ఎన్నో కప్పులు టీ తాగేస్తున్న పురుషులకు ఈ లాభం కలగటం లేదని కూడా ఈ పరిశోధన తెలిపింది. అధ్యయనకార్లు తమ పరిశోధనను 2613 మంది పురుషులపైనా, 3984 మంది మహిళలపైనా రక్తనాళాలలో గల అడ్డంకుల కొరకు అల్ట్రా సౌండ్ మెషీన్ ఉపయోగించి చేశారు.
అంతేకాదు, అత్యధిక రక్తపోటు వున్న మహిళలు టీ తాగడం వలన తమ రక్తపోటు నియంత్రించుకోగలుగుతున్నారని కూడా పరిశోధన వెల్లడించింది. రక్త నాళాల అడ్డంకులను పురుషులు ఎందుకని టీ తాగి తొలగించుకోలేకపోతున్నారనేది పరిశోధనకు అందటం లేదు. అయితే, బహుశ, మహిళలలో వుండే ఈస్ట్రోజన్ హార్మోన్ వీరు తాగే టీ వలన స్పందించి వారి రక్తనాళాలలో అడ్డంకులు తక్కువ చేస్తోందని ఒక సిద్ధాంతంగా కూడా పరిశోధకులు అభిప్రాయపడ్డారు.