చెవిలో సహజంగా పేరుకునే దుమ్ము,గుబిలిని శుభ్రం చేయడానికి శరీరం ఒక వ్యవస్థను ఏర్పరుచుకుని ఉంది… ఒకటి చెవి నిర్మాణం. చెవి లోపల ఉన్న నూనూగు వెంట్రుకలు దుమ్మును లోపలికి చేరకుండా ఆపుతాయి. మిగతాది గుబిలికి అంటుకుంటుంది.(గుబిలి అనేది చెవిలో సహజంగా గ్రంధుల నుండి ఉత్పత్తి అయ్యే ఒక ద్రావణం. దానికి చర్మ మృతకణాలు,దుమ్ము కలిసి ఘనీభవిస్తుంది.) ఆ గుబిలిని బయటికి పంపేందుకు ముందుగా మనం అనుకున్నట్టు చెవి సహజ నిర్మాణం సహకరిస్తే మరొకటి మన దవడ కదలికలు. ఆ కదలికల వల్ల ఎండిన గుబిలి బయటికి వచ్చేస్తుంది.
ఎక్కువ దుమ్ము చేరినా,ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ గుబిలి పెరిగి మనకి చెవి నొప్పి రావడం జరుగుతుంది. ఇప్పుడు మన ప్రశ్న హైడ్రోజన్ పెరాక్సైడ్ చెవిలో దుమ్మును శుభ్రం చేయడానికి వాడవచ్చా అని! కూడదు అనే చెప్పచ్చు! దీనికి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.ఒకటి లేదా రెండు చుక్కలు వేసి పలుచటి శుభ్రమైన గుడ్డని చెవి గోడలకి ఆనించి శుభ్రం చేయవచ్చు…కానీ ఈ ప్రక్రియ స్వంతగా ప్రయత్నించడం కష్టమే.
మోతాదుకు మించి h2o2 ని చెవిలో వేస్తే అది H2O(నీరు) మరియు O2(ఆక్సీజన్) గా మారి నీరు అక్కడే నిలిచిపోతుంది(ఒకటి లేదా రెండు చుక్కలు వేసి ముందే చెప్పిన విధంగా శుభ్రం చేస్తే ఆ నీరు నిలిచే అవకాశం ఉండదు) నిలిచిన నీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది.(మా అనుభవంలో ఇలాంటివి చాలానే చూసాము) కనుక దుమ్మును శుభ్రం చేసే ప్రక్రియను శరీరానికే వదిలేసి(వీలైతే ఎక్కువ దుమ్ము చేరకుండా జాగ్రత్తలు పాటించి) మరీ ఇబ్బంది అనిపిస్తే వైద్యుని సలహా పాటించి అనుకరించడం మంచిది.