Beer Benefits And Side Effects : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు చాలా మంది అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా శీతల పానీయాలను, పళ్ల రసాలను ఈ సీజన్‌లో అధికంగా సేవిస్తుంటారు. అలాగే సోడాలను కూడా తాగుతుంటారు. అయితే మద్యం ప్రియులు మాత్రం బీర్‌ను పానీయంగా సేవిస్తుంటారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందవచ్చని చెప్పి వారు బీర్‌లను ఎక్కువగా తాగుతుంటారు. వేసవిలో ఇతర మద్యం కన్నా బీర్‌ల అమ్మకాలే అధికంగా ఉంటాయి. అయితే వాస్తవానికి బీర్ తాగితే ఏమవుతుంది.. దీని వల్ల ఆరోగ్యానికి ఏదైనా మేలు జరుగుతుందా.. దీంతో ఎలాంటి నష్టాలు ఉంటాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీర్‌ను మోతాదులో తాగితే ఆరోగ్యానికి మేలే జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బీర్‌లో కొన్ని రకాల సమ్మేళనాలు ఉంటాయి. అలాగే పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యానికి సహకరిస్తాయి. బీర్‌లో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఉంటాయి. ఇవన్నీ పోషకాహార లోపం నుంచి బయట పడేస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి.
బీర్‌ను మోతాదులో తాగడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి నుంచి బయట పడవచ్చు. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. బీర్‌ను సేవించడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. దీంతో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. బీర్‌ను మోతాదులో సేవించడం వల్ల కిడ్నీ స్టోన్స్ రాకుండా అరికట్టవచ్చని, కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు. అయితే బీర్ వల్ల కలిగే లాభాల గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు నష్టాల గురించి చూద్దాం.
బీర్‌ను మోతాదుకు మించి తాగితే అనర్థాలు సంభవిస్తాయి. మద్యానికి బానిసలు అయ్యే అవకాశాలు ఉంటాయి. లివర్ కు నష్టం జరుగుతుంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ హెపటైటిస్, సిర్రోసిస్ వంటి లివర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. బీర్‌ను మోతాదులో తాగితే ఎలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అధికంగా తాగితే అంతే నష్టం కూడా జరుగుతుంది. బీర్‌లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కనుక బీర్‌ను రోజూ అధికంగా సేవిస్తుంటే బరువు పెరుగుతారు. ఇది గుండె జబ్బులు, డయాబెటిస్‌కు దారి తీస్తుంది.
బీర్‌ను అధికంగా సేవించే వారిలో లివర్, నోరు, గొంతు, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని సైంటిస్టులు తేల్చారు. బీర్ ఎంత చల్లని పానీయం అయినప్పటికీ మోతాదులో తాగితే ఏమీ కాదు. కానీ అధికంగా సేవిస్తే అందులో ఉండే ఆల్కహాల్ డీహైడ్రేషన్‌ను కలగజేస్తుంది. ఇది వేసవిలో అసలు మంచిది కాదు. కనుక బీర్‌ను అధికంగా సేవించే వారు మానుకోవాలి. తక్కువ మోతాదులో ఎప్పుడో ఒకసారి తాగితే లాభాలను పొందవచ్చు. కానీ రోజూ బీర్‌ను సేవిస్తే మాత్రం నష్టం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.