Dry Coconut Patika Bellam : నేటి రోజుల్లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం, తగినంత విటమిన్ డి శరీరానికి లభించకపోవడం వంటి కారణాల వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యల బారిన పడుతున్నారు. వయసు పైబడడం వల్ల ఈ నొప్పులు తలెత్తడం సహజమే అయినప్పటికి ప్రస్తుత కాలంలో యువతలో కూడా మనం ఈ సమస్యలను చూసున్నాం. మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం ఎటువంటి నొప్పులు లేకుండా హాయిగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఈ డ్రింక్ ను తాగడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాల బారిన కూడా పడకుండా ఉంటాము. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులను తగ్గించే ఈ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం సోంపు గింజలను, ఎండు కొబ్బరిని, గసగసాలను, పటిక బెల్లాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి ఉపయోగించిన ప్రతి పదార్థం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేదే. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి మినరల్స్, విటమిన్స్, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు కూడా ఉంటాయి. ఈ పదార్థాలతో డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
ఈ పదార్థాలతో డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల దేశ వాలీ ఆవు నెయ్యిని తీసుకుని వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక గసగసాలు వేసి వేయించాలి. గసగసాలు వేగిన తరువాత ఒక గ్లాస్ పాలను పోసి రెండు నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ సోంపు గింజలను లేదా సోంపు గింజలను పొడిగా చేసుకుని వేసుకోవాలి. తరువాత రెండు ఇంచుల కొబ్బరి ముక్కను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత రుచికి తగినంత పటిక బెల్లాన్ని వేసి కలపాలి. డయాబెటిస్ తో బాధపడే వారు పటిక బెల్లాన్ని ఉపయోగించకపోవడమే మంచిది. ఇప్పుడు ఈ పాలను ఒక పొంగు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ పాలను గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.
ఇప్పుడు సోంపు గింజలను, ఎండు కొబ్బరి ముక్కలను తింటూ ఈ పాలను తాగాలి. ఇలా తయారు చేసుకున్న పాలను రోజూ రాత్రి పడుకోవడానికి గంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా డ్రింక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి వంటి నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ పాలను తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. రక్తవిరోచనం, జిగట విరోచనం వంటి సమస్యలు తగ్గుతాయి. గొంతు సమస్యలు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. మూత్రసంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.