సాధారణంగా లావుగా వున్న వారికి లేదా సెలబ్రిటీలకు మాత్రమే డైటీషియన్లు లేదా పోషకాహార నిపుణుల సలహాలు కావాలని అనుకుంటాం. అసలు మన శరీరానికి ఏ ఆహారం మంచిది? ఏ ఆహారం మంచిది కాదు అనేది మనకు తెలియదు. రుచిని బట్టి లేదా ఆసక్తిని బట్టి, అవసరమున్నా, లేకపోయినా, వివిధ రకాల ఆహారాలు వివిధ మొత్తాలలో తింటూవుంటాం. నేడు కుప్పలు తెప్పలుగా మార్కెట్ లో రెడీ మేడ్ ఫుడ్స్ సైతం వచ్చిపడుతున్నాయి. సరిగ్గా ఇక్కడే ప్రతి వారికి ఒక డైటీషియన్ లేదా పోషకాహార నిపుణుల సలహాలు సహకరిస్తాయి.
డైటీషియన్ ఏం చేస్తాడు? ఆరోగ్యంగా ఎలా వుండాలి? వ్యాధులకు ఎలా దూరంగా వుండాలి? అనే అంశాలపై ఆహారం, జీవన విధానం సూచిస్తాడు. అంతేకాదు అవసరాన్నిబట్టి వైద్య సలహాలు కూడా ఇస్తాడు. కనుక ప్రతి ఒక్కరికి డైటీషియన్ అవసరమే! డైటీషియన్ వలన ప్రయోజనాలు.. ఆరోగ్యమే లక్ష్యంగా శక్తి, పోషక విలువలు కల ఆహారాన్ని సూచిస్తారు. డయాబెటీస్, అధిక కొల్లెస్టరాల్, గుండె సమస్యలు, లావెక్కటం వంటి సమస్యలున్నవారు డైటీషియన్ ను తప్పక పెట్టుకోవాలి.
గర్భవతులు వారికి, పుట్టబోయే బిడ్డకు అవసరమైన పోషక విలువల ఆహార సూచనలకు డైటీషియన్ ను సంప్రదించాలి. బిడ్డ పుట్టిన మహిళలు బిడ్డకు తల్లిపాలు ఇస్తారు కనుక ఆ సమయంలో వారు తినదగిన పదార్ధాల కొరకు డైటీషియన్ ను సంప్రదించాలి. డైటీషియన్లు పోషకాలను తమ ఛార్టుల ద్వారా ప్రణాళిక చేసి మీకు జబ్బులు వున్నట్లయితే వాటిని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు.ఆహారం తయారీ లేదా భుజించడమనే అంశాలు ప్రతి ఒక్కరికి వేరు వేరుగా వుంటాయి. అంతే కాని ఎవరో ఒకరు షుగర్ వున్నప్పటికి స్వీటు తిన్నారని అందరూ తింటే ఎంతో నష్టం కలిగిస్తుంది. కనుక డైటీషియన్ సలహాలు వ్యక్తిగతంగా పాటించండి.