Fatty Liver Tips : మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. మన శరీరంలో కాలేయం అతి ముఖ్యమైన, కీలకమైన విధులను నిర్వర్తిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యం ఉంటుంది లేదంటే మనం తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కానీ మారిన జీవన విధానం, ముఖ్యంగా ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల కాలేయ సంబంధిత సమస్యలు మనలో తలెత్తుతున్నాయి. ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న కాలేయ సంబంధిత సమస్యల్లో ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా మనలో చాలా మంది బాధపడుతున్నారు. అయితే చాలా మందికి ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్టు కూడా తెలియదు.
ఫ్యాటీ లివర్ సమస్య స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు వచ్చే దాకా ఈ సమస్య ఉన్నట్టు మనలో చాలా మందికి తెలియదు. మన శరీరంలో కాలేయం కిలో 200 గ్రాముల నుండి కిలోన్నర బరువు వరకు ఉంటుంది. ఈ బరువులో 5 శాతానికి పైగా కొవ్వు ఉంటేనే దానిని ఫ్యాటీ లివర్ గా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారం ఎక్కువగా తీసుకుని శారీరక శ్రమ, వ్యాయామం తక్కువగా చేసినప్పుడు కాలేయంలో కొవ్వు నిల్వలు ఎక్కువయ్యి ఈ సమస్య తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయం పనితీరు మందగిస్తుంది.
దీంతో దీని ప్రభావం ఇతర అవయవాలపై పడి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక మనం ఈ సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు వీలైనంత వరకు క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అదే విధంగా మనం తీసుకునే ఆహారం కూడా శుభ్రంగా, నాణ్యమైన వాటినే తీసుకోవాలి. అలాగే వీలైనంత వరకు వారానికి ఒకరోజు ఉపవాసం చేస్తూ ఉండాలి.
వీటితో పాటు ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉండే పుల్లటి మజ్జిగ, పెరుగు వంటి వాటిని తీసుకోవాలి. ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఊబకాయంతో బాధపడే వారిలో వస్తుంది. కనుక వారు వారి బరువులో 5 నుండి 10 శాతం వరకు తగ్గితే ఫ్యాటీ లివర్ సమస్య కూడా దాదాపుగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా బరువు పెరగకుండా ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య దాదాపు తలెత్తుకుండా ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారే కాకుండా ఈ సమస్య భవిష్యత్తులో తలెత్తకుండా ఉండాలనుకునే వారు కూడా ఈ జాగ్రత్తలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.