Heart Health : ఒకప్పుడు గుండె జబ్బులు కేవలం వృద్ధాప్యంలో ఉన్నవారికే వచ్చేవి. వయస్సు మీద పడడం వల్ల సహజంగానే గుండె జబ్బుల బారిన పడేవారు. కానీ ప్రస్తుత తరుణంలో యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, అస్తవ్యస్తమైన జీవన విధానం వల్లే చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. గుండె జబ్బులు రాకుండా ఎప్పటికీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. అందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే..
1. రోజూ తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఓట్స్, తృణ ధాన్యాలు, బ్రౌన్ రైస్, బీన్స్, కూరగాయలు, పండ్లను అధికంగా తినాలి. దీంతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించవచ్చు.
2. అధిక బరువు అనేక సమస్యలకు మూలం. దీని వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు వస్తాయి. కనుక బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే బీపీ ఉన్నవారు ఆ సమస్య నుంచి బయట పడాలి. షుగర్ ఉన్నవారు షుగర్ లెవల్స్ పెరగకుండా చూసుకోవాలి. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
3. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తినడంతోపాటు వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేయడం వల్ల అనేక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే వ్యాయామం చేయాలి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
4. ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. నిద్ర సరిగ్గా పోకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు వస్తాయి. కనుక రోజూ కనీసం 7-8 గంటల పాటు అయినా సరే నిద్రించాలి. దీని వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
5. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అందులో ఉండే సోడియం బీపీని పెంచుతుంది. ఇది గుండెకు హానికరం. కనుక ఉప్పును తక్కువగా తినాలి. అలాగే చక్కెర, తీపి పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి. దీంతో షుగర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.
6. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు రోజూ రెడ్ వైన్‌ను 60 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం.. రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. కనుక రోజూ పరిమిత మోతాదులో రెడ్ వైన్ తాగితే గుండెకు మేలు చేస్తుంది.