Urinary Problems : మూత్ర విసర్జన అనేది రోజూ మనం తాగే ద్రవాలను బట్టి వస్తుంది. మనం ఎక్కువగా ద్రవాలను తాగుతున్నా.. చల్లని ప్రదేశంలో ఉన్నా.. మూత్రం సహజంగానే ఎక్కువగా వస్తుంది. అయితే రోజూ వచ్చే మూత్ర విసర్జన కన్నా ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందంటే.. దానికి ఏవో కారణాలు ఉండే ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) లేదా మూత్రాశయ ఇన్ఫెక్షన్‌లు ఉంటే మూత్రం ఎక్కువ సార్లు వెళ్తారు. మూత్రపిండాలు, మూత్ర నాళాలు, మూత్రాశయం అన్నింటిలోనూ సూక్ష్మజీవుల వల్ల ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. అయితే మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ వస్తే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తారు. అందువల్ల దానికి మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.
2. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి కూడా మూత్రం ఎక్కువగా వస్తుంది. శరీరంలో ఎక్కువగా ఉండే గ్లూకోజ్ మూత్రం ద్వారా బయటకు పోతుంది. దీంతో దాహం అవుతుంది. నీళ్లను ఎక్కువగా తాగుతారు. మూత్రం ఎక్కువగా వస్తుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కనుక మూత్ర విసర్జన సాధారణం కన్నా ఎక్కువ సార్లు చేస్తుంటే.. దాన్ని షుగర్ గా అనుమానించి టెస్టులు చేయించుకోవాలి.
3. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి కూడా మూత్రం ఎక్కువగా వస్తుంది. కనుక డాక్టర్ సూచన మేరకు థైరాయిడ్ టెస్టును కూడా చేయించుకోవాలి.
4. ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులను ప్రభావితం చేసే అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి. పురుష పునరుత్పత్తి వ్యవస్థలో ఉన్న చిన్న గ్రంథి అయిన ప్రోస్టేట్.. స్పెర్మ్‌ను సుసంపన్నం చేసే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. విస్తరించిన ప్రోస్టేట్ వల్ల తరచుగా మూత్రవిసర్జన, నొప్పి లేదా మూత్ర విసర్జన సమయంలో మంట లేదా మూత్ర విసర్జన ఆపడం లేదా ప్రారంభించడం వంటి.. అనేక సమస్యలను కలిగిస్తుంది. కనుక ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
5. రోజూ మూత్ర విసర్జన సాధారణం కన్నా ఎక్కువగా అవుతుంటే.. స్ట్రోక్ బారిన పడతారేమోనని అనుమానించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి.
6. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి కూడా మూత్ర విసర్జన ఎక్కువగా అవుతుంటుంది. కనుక డాక్టర్‌ను కలిస్తే అసలు సమస్య ఎక్కడ ఉందో గుర్తిస్తారు. దీంతో సులభంగా సమస్య నుంచి బయట పడవచ్చు. ప్రాణాపాయ పరిస్థితులు రాకుండా చూసుకోవచ్చు.