Garlic For Backpain : ప్రస్తుత కాలంలో చాలా మంది నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, మెడ నొప్పి వంటి వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ నొప్పుల కారణంగా సరిగ్గా నిలబడలేము, కూర్చోలేము, నడవలేము, నిద్రించలేము. కనీసం మన పని కూడా మనం చేసుకోలేకపోతాము. ఇలా కీళ్ల నొప్పుల బారిన పడే వారిలో 30 సంవత్సరాల లోపు వాళ్లు ఉండడం మనల్ని మరింత ఆందోళనకు గురి చేస్తుంది. పోషకాహార లోపం, ఎక్కువ సేపు ఒకే దగ్గర కూర్చొని పని చేయడం, తగినంత వ్యాయామం లేకపోవడం వంటి వాటిని ఈ సమస్యలు తలెత్తడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇలా నడుము నొప్పి తలెత్తగానే చాలా మంది పెయిన్ కిల్లర్ లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల మనం భవిష్యత్తులో అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మందులే కాకుండా కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఈ నొప్పులన్నింటిని తగ్గించుకోవచ్చు. నడుము నొప్పిని తగ్గించడంలో వంటగదిలో ఉండే వెల్లుల్లి మనకు ఉపయోగపడుతుంది. దీనిలో ఎలిసిన్ అనే పదార్థం ఉంటుంది. నడుము నొప్పిని, వెన్ను నొప్పిని తగ్గించడంలో ఇది మనకు ఎంతో దోహదపడుతుంది. ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఒక పెయిన్ కిల్లర్ లాగా ఉపయోగిస్తారు. నడుము నొప్పితో బాధపడే వారు ప్రతిరోజూ ఉదయం పూట పరగడుపున రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తినాలి. ఇలా చేయడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. కొందరూ వీటిని నేరుగా తినలేరు. అలాంటి వారు వెల్లుల్లి రెబ్బలను తేనెతో కలిపి తీసుకోవాలి. అయితే ఈ వెల్లుల్లిని మెత్తగా దంచుకుని లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
5 నిమిషాల తరువాత మాత్రమే ఈ వెల్లుల్లిని తీసుకోవాలి. ఇలా వెల్లుల్లిని తినలేని వారు పది చుక్కల వెల్లుల్లి రసాన్ని పావు గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా నడుము నొప్పి తగ్గుతుంది. అలాగే నడుము నొప్పిని తగ్గించడంలో అల్లం కూడా మనకు ఎంతో దోహదపడుతుంది. ప్రతిరోజూ ఒక కప్పు అల్లం టీని తాగడం వల్ల లేదా వంటల్లో అల్లాన్ని వాడడం వల్ల మనం నడుము నొప్పిని, వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ అల్లం టీ ని తయారు చేసుకోవడానికి గానూ ఒక కప్పు నీటిలో ఒక ఇంచు అల్లం ముక్కను ముక్కలుగా చేసి వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత అందులో తేనెను, నిమ్మరసాన్ని కలపాలి. ఇలా చేయడం వల్ల అల్లం టీ తయారవుతుంది.
దీనిని తాగడం వల్ల కూడా మనం నడుము నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నడుము నొప్పితో బాధపడే వారు కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గానుగలో ఆడించిన ముడి కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నడుము నొప్పిని తగ్గించడంలో తోడ్పడతాయి. కొబ్బరి నూనెను తీసుకుని నొప్పి ఉన్న చోట రాసి 10 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేయడం వల్ల నడుము నొప్పి నుండి క్రమంగా ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా పాలల్లో పసుపును కలిపి తీసుకోవడం వల్ల కూడా వెన్ను నొప్పి, నడుము నొప్పి తగ్గుతుంది. పాలల్లో ఉండే క్యాల్షియం, విటమిన్ డి ఎముకలను ధృడంగా ఉంచడంలో పసుపులో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడతాయి.
నడుము నొప్పి బాధిస్తున్నప్పుడు నొప్పి ఉన్న చోట ఐస్ ప్యాక్ ను లేదా హాట్ ప్యాక్ ను 20 నిమిషాల పాటు ఉంచడం వల్ల, వేడి నీటితో కాపడం పెట్టుకోవడం వల్ల కూడా నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే నడుము నొప్పి, వెన్ను నొప్పితో బాధపడే వారు ప్రతిరోజూ వ్యాయామం, యోగా వంటివి చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా వెన్ను నొప్పిని, నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. అయితే ఈ చిట్కాలను పాటించినప్పటికి సమస్య తగ్గని వారు వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.