Dry Fruits Milk Shake : మనం రకరకాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎముకలను ధృడంగా ఉంచడంలో, తెలివి తేటలను పెంచడంలో, మెదడును, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తహీనత సమస్యను తగ్గించడంలో, శరీరాన్ని బలంగా, ధృడంగా తయారు చేయడంలో ఇలా అనేక విధాలుగా డ్రై ఫ్రూట్స్ మనకు మేలు చేస్తాయి. చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను నీళ్లల్లో నానబెట్టి నేరుగా తీసుకుంటూ ఉంటారు. కానీ పిల్లలు నేరుగా వీటిని తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి ఈ డ్రై ఫ్రూట్స్ తో మిల్క్ షేక్ ను ఇవ్వడం వల్ల వారు ఇష్టంగా తాగుతారు. దీంతో మనం రుచిని, పోషకాలను అందించిన వారమవుతాము. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదం పప్పు – 6, జీడిపప్పు – 15, అంజీరాలు – 4, పండు ఖర్జూరాలు – 5, గోరు వెచ్చటి నీళ్లు – తగినన్ని, పంచదార – పావు కప్పు, కాచిచల్లార్చిన పాలు – అర లీటర్, రోజ్ వాటర్ – పావు టీ స్పూన్.
డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బాదం పప్పు, జీడిపప్పు, అంజీరాలు, ఖర్జూరాలను తీసుకోవాలి. తరువాత తగినన్ని గోరు వెచ్చని నీటిని పోసి ఒక గంట పాటు నానబెట్టాలి. తరువాత వీటిని నీటితో సహా ఒక జార్ లోకి తీసుకుని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పంచదార, పాలు, రోజ్ వాటర్ వేసి రెండు నుండి మూడు నిమిషాల పాటు మెత్తగా మిక్సీ పట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారవుతుంది. దీనిలో పంచదారకు బదులుగా తేనెను కూడా వేసుకోవచ్చు. అలాగే రోజ్ వాటర్ అందుబాటులో లేని వారు యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్ లో ఐస్ క్యూబ్స్ ను వేసి చల్లగా కూడా తీసుకోవచ్చు. పిల్లలకు స్నాక్స్ గా ఈ మిల్క్ షేక్ ను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. పోషకాహార లోపంతో బాధపడే వారు, రక్తహీనత సమస్య ఉన్న వారు, గర్భిణీ స్త్రీలు ఈ మిల్క్ షేక్ ను తీసుకోవడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.