భారతదేశంలో కరివేపాకులు చాలా పాపులర్. వీటిని నిత్యం మనం కూరల్లో వేస్తుంటాం. కరివేపాకులను కూరల్లో వేయడం వల్ల చక్కని రుచి, వాసన వస్తాయి. కరివేపాకులతో కొందరు నేరుగా కారం పొడి వంటివి చేసుకుని తింటుంటారు. అయితే నిజానికి ఈ ఆకులను కొందరు కూరల్లోంచి తీసిపడేస్తారు. కానీ వీటి వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అనేక అనారోగ్య సమస్యలను కరివేపాకులతో తగ్గించుకోవచ్చు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
కరివేపాకులను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో అధిక బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు వీటిని నిత్యం ఆహారంలో తీసుకోవాలి. అయితే నేరుగా ఆకులను తినలేని వారు వాటిని పొడి చేసుకుని దాన్ని ఆహారంలో కలుపుకుని తినవచ్చు. లేదా సలాడ్స్, ఇతర ఆహారాలతో కలిపి తీసుకోవచ్చు. దీంతో ప్రయోజనం కలుగుతుంది.
ఉదయాన్నే పరగడుపునే కొన్ని కరివేపాకులను అలాగే నమిలి మింగాలి. లేదా వాటిని ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని మజ్జిగలో కలుపుకుని ఉదయాన్నే పరగడుపునే తాగేయాలి. దీంతో విరేచనాలు తగ్గుతాయి. మలబద్దకం సమస్య ఉన్నా తగ్గుతుంది.
గర్భంతో ఉన్న మహిళలకు ఒక దశలో వాంతులు అవుతుంటాయి. అలాగే వికారంగా అనిపిస్తుంటుంది. ఇక వీరే కాకుండా కొందరికి అప్పుడప్పుడు వికారం సమస్య వస్తుంటుంది. అలాంటి వారు కూడా కరివేపాకులను నిత్యం తింటుండాలి. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కరివేపాకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు కలిగినప్పుడు వీటిని తింటే త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. బాక్టీరియా, వైరస్ ల వల్ల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు, జ్వరాలు వచ్చినప్పుడు కరివేపాకులను తినాలి. వీటితో కషాయం చేసుకుని కూడా తాగవచ్చు. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
కరివేపాకుల్లో కాపర్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి క్లోమగ్రంథిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను రక్షిస్తాయి. ఈ క్రమంలో రక్తంలో షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. డయాబెటస్ ఉన్నవారు నిత్యం కరివేపాకులను తింటే మంచిది. షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.
కరివేపాకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే శుక్లాలు (కటారాక్ట్) రాకుండా చూస్తుంది. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
కరివేపాకులను కొన్నింటిని తీసుకుని వాటిని పేస్ట్‌లా చేయాలి. అవసరం అనుకుంటే ఆ పేస్ట్‌లో నీటిని కలుపుకోవచ్చు. ఆ పేస్ట్‌ను కాలిన గాయాలు, దెబ్బలు, చర్మంపై ఇతర సమస్యలు ఉన్న చోట్లలో రాయాలి. దీంతో గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి.
కరివేపాకుల పేస్ట్‌ను తలకు బాగా రాసి అనంతరం కొంత సేపటికి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల వెంట్రుకల సమస్యలు తగ్గుతాయి. శిరోజాలు దృఢంగా మారుతాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య ఉండదు.
కరివేపాకులను నిత్యం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.