Antioxidant Rich Foods : మన శరీరాన్ని వ్యాధుల బారి నుంచి రక్షించేందుకు యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో విడుదలయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. అలాగే కణజాలాన్ని రక్షిస్తాయి. అయితే అసలు ఫ్రీ ర్యాడికల్స్ అంటే ఏమిటి ? అవి మన శరీరంలో ఎలా ఉత్పన్నమవుతాయి ? వాటిని యాంటీ ఆక్సిడెంట్లతో ఎలా అడ్డుకోవాలి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరం మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే సమయంలో ఫ్రీ ర్యాడికల్స్ (ఒక రకమైన అణువులు) విడుదలవుతాయి. అలాగే పొగను పీల్చినా, రేడియేషన్‌కు గురైనా మన శరీరంలో అవి ఉత్పన్నమవుతాయి. ఈ క్రమంలో అవి మన శరీరంలోని కణజాలాన్ని నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె జబ్బులు తదితర వ్యాధులు వస్తాయి. అయితే ఆ ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించాలంటే మనం యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలను తీసుకోవాలి.
యాంటీ ఆక్సిడెంట్లలో అనేక రకాలు ఉంటాయి. కెరోటినాయిడ్లు (కెరోటీన్, లైకోపీన్), ఫ్లేవనాయిడ్లు (ఆంథో సయనిన్, ఫ్లేవనాల్స్, ఫ్లేవోన్స్, ఐసో ఫ్లేవనాయిడ్స్), ఇండోల్స్, ఐసోథయోసయనేట్స్, గ్లూకో సైనోలేట్స్, థయో సల్ఫైడ్స్.. ఇలా రక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనకు అనేక పదార్థాల్లో లభిస్తాయి. ముఖ్యంగా నారింజ పండ్లు, క్యారెట్లు, గుమ్మడికాయలు, చిలగడదుంపలు, బఠానీలు, చిక్కుడు జాతి గింజలు, ఆకుపచ్చని కూరగాయలు, టమాటాలు, పుచ్చకాయలు, ఉల్లిపాయలు, పాలకూర, వెల్లుల్లి, శనగలు, బెండకాయలు, గ్రీన్ టీ, డార్క్ చాకొలెట్స్, లవంగాలు, దాల్చిన చెక్క.. తదితర అనేక పదార్థాల్లో మనకు రకరకాల యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల మన శరీరాన్ని రక్షించుకోవచ్చు. గుండె జబ్బులు, క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.