Hibiscus Tea : మన ఇంట్లో పెంచుకునే రకరకాల పూల మొక్కల్లో మందార మొక్క ఒకటి. ఈ మొక్కను అలాగే ఈ మందార పువ్వులను చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. మనకు వివిధ రంగుల్లో ఈ మందార పూలు లభిస్తాయి. మందార పువ్వుల్లో, మందార చెట్టు ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయని మనందరికి తెలిసిందే. జుట్టు సంరక్షణలో భాగంగా వీటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. మందార ఆకులను, పూలను ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా మందార పువ్వులను ముఖానికి ప్యాక్ లా కూడా వేసుకోవచ్చు. దీని వల్ల ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది.
అయితే మందారం అనేది మన కేశ సంరక్షణకు అందానికి మెరుగుపరుచుకోవడానికి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా చక్కగా పని చేస్తుంది. మందార పువ్వులతో చేసిన టీ ని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మందార పువ్వుల్లో అనేక రకాలు ఉన్నప్పటికి ఒంటి రెక్క ఎర్ర మందారాల్లోనే ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద ఔషధాల్లో ఈ ఎర్ర మందారాలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఎర్ర మందారాలతో టీ ని ఎలా తయారు చేసుకోవాలి.. ఈ మందార టీ ని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మందార టీ ని తయారు చేసుకోవడానికి ముందుగా మూడు మందార పువ్వులను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి.
నీళ్లు మరిగిన తరువాత మందార పువ్వుల రేకులను విడదీసి వేసుకోవాలి. వీటిని మరో రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ గిన్నెపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ టీ ని వడకట్టి ఒక కప్పులోకి తీసుకోవాలి. తరువాత ఈటీ లో అర చెక్క నిమ్మరసాన్ని పిండి కలుపుకోవాలి. అలాగే రుచి కొరకు దీనిలో తేనెను కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న మందార పువ్వుల టీ ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ టీని తాగడం వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు లభిస్తాయి.
ఈ టీ ని తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. మందార టీని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ టీని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రంలో ఉంటాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో కూడా మందార టీ దివ్యౌషధంగా పని చేస్తుంది. ఈ మందార టీ ని తాగడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య కూడా తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్దకం సమస్య తగ్గడంలో పాటు జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.
అధిక బరువుతో బాధపడే వారు ఈ టీ ని తాగడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ టీ మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ బారిన పడే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. ఈ మందార టీ కి శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది. కనుక అధిక వేడితో బాధపడే వారు ఈ టీని తాగడం వల్ల వేడి తగ్గి శరీరానికి చలువ చేస్తుంది. ఎండిన మందార పువ్వులతో కూడా మనం ఈ టీ ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మందార పువ్వుల టీ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.