Bath : చలికాలంలో సహజంగానే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. వేసవి కాలంలో చన్నీళ్ల స్నానం ఎంతో హాయినిస్తుంది. ఈ క్రమంలోనే కాలాలకు అనుగుణంగా ఎవరైనా స్నానం చేస్తారు. చలికాలంలో వేన్నీళ్ల స్నానం చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. అంతేకాదు, హాయిగా కూడా ఉంటుంది. చలి నుంచి దూరంగా ఉండవచ్చు. అయితే చలికాలంలో వేన్నీళ్ల స్నానం చేయడం మంచిదే.. కానీ దాంతో కొన్ని సమస్యలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో వేన్నీళ్ల స్నానం చేయడం వల్ల చలికి దూరంగా ఉండొచ్చు. హాయిగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. అయితే మరీ బాగా వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయరాదు. అలాగే ఎక్కువ సేపు కూడా స్నానం చేయరాదు.
చలికాలంలో కొందరు ఎక్కువ సేపు వేన్నీళ్ల స్నానం చేస్తుంటారు. ఇది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. వేన్నీళ్లలో ఎక్కువ సేపు ఉండడం వల్ల చర్మం, శిరోజాలపై ఉండే సహజసిద్ధమైన నూనెలు పోతాయి. దీంతో ఆయా భాగాలు పొడిగా మారుతాయి. ఈ క్రమంలో చర్మం పొడిగా మారి పగిలి దురదలు పెడుతుంది. అలాగే శిరోజాలు పొడిగా మారి రాలిపోతాయి.
అందువల్ల వేన్నీళ్లతో ఎక్కువ సేపు స్నానం చేయవద్దు. ఒక మోస్తరుగా ఉండే వేడినీళ్లతోనే స్నానం చేయాలి. అది కూడా 10 నిమిషాలలోపే స్నానం ముగించాలి. దీంతో చర్మం, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.