వేసవిలో ప్రధానంగా వేధించే సమస్యల్లో డీ హైడ్రేషన్ ఒకటి. శరీరంలో నీరు ఇంకిపోవడం వల్ల నిర్జలీకరణం ఏర్పడి ఇబ్బంది పెడుతుంది. ఇవే కాదు ఇంకా చాలా సమస్యలు వేసవిలో అనారోగ్యాన్ని దెబ్బ తీస్తుంటాయి. వాటిని అరికట్టడానికి దోసకాయ నీరు చాలా మేలు చేస్తుంది. దోసకాయ నీరేంటని ఆశ్చర్యపోతున్నారా? దోసకాయ వల్ల ఎన్ని లాభాలున్నాయో అందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. డీహైడ్రేషన్ నుండి దోసకాయ నీరు కాపాడుతుంది. శరీరంలో నీటిని అంత తొందరగా ఇంకిపోకుండా ఉంచుతుంది.
దోసకాయలో యాంటీఆక్సిడెంటల్ లక్షణాలు ఉంటాయి. దానివల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకి నెట్టివేయబడతాయి. దోసకాయ నీటిని తాగడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. దోసకాయలో ఉండే సిలికా కణజాలాలను పటిష్టం చేస్తుంది. నోటి దుర్వాసనని పోగొడుతుంది. కొన్ని కొన్ని సార్లు బ్రష్ చేసుకున్న తర్వాత కూడా నోటి నుండి దుర్వాసన వస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు దోసకాయ నీరుని తాగితే చాలా మేలు కలుగుతుంది. నలుగురిలో మాట్లాడలేక తాము అనుకున్నది చెప్పలేక నోటి దుర్వాసన వల్ల ఇబ్బంది పడే చాలా మంది ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
బరువు తగ్గడానికి దోసకాయ నీరు ఉపయోగపడుతుంది. మీరు బరువు తగ్గాలని డైట్ పాటిస్తున్నట్లయితే దానికి దోసకాయ నీరుని యాడ్ చేసుకోండి. ముఖంపై ఉన్న మచ్చలు పోవడానికి, ముఖం అందంగా కనిపించడానికి దోసకాయ నీరు చాలా తోడ్పడుతుంది. ఐతే ఇన్ని ప్రయోజనాలున్న దోసకాయ నీరుని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. మొదట దోసకాయలను ముక్కలు తరిగి, వాటిని అర లీటర్ నీళ్ళలో ఉంచి కొంతకాలం పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఆ తర్వాత వాటిని తాగడానికి ఉపయోగించాలి. ఇలా తయారు చేసిన దోసకాయ నీరు రెండు రోజుల కంటే ఎక్కువ ఉపయోగించకూడదు.