మనమందరం ఎప్పుడోఒకప్పుడు పొద్దున బ్రేక్‌ఫాస్ట్ ఎగ్గొట్టినవాళ్లమే. కారణాలనేకం. టిఫిన్ నచ్చకపోవడం, ఉదయమే ఊరెళ్లాల్సిరావడం, ఇంకేదైనా పనిఉండడం… ఇలా. ఏదేమైనా పొద్దున అల్పాహారం మిస్ చేయడం, రాత్రి భోజనం లేట్‌గా చేయడం చాలా ప్రమాదకరమని పరిశోధనలు తేల్చాయి.
సాధారణంగా ఎవరు ఎలాంటి ఆహారం తీసుకున్నా, అన్ని ప్రాంతాలవారు ఏదోఒకటి పొద్దున్నే తినడం అలవాటు. చద్దన్నం-పెరుగు, ఇడ్లీ-వడ, బ్రెడ్ టోస్ట్, ఉడికించిన కూరగాయముక్కలు.. ఇలా ఎవరికి నచ్చింది వారు తింటారు. అయితే, తీరికలేని ప్రస్తుత జీవనశైలిలోఅప్పుడప్పుడు ఈ అల్పాహారం తీసుకోవడం కుదరకపోవచ్చు. కానీ ఇక తప్పదు. బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం, రాత్రిళ్లు లేట్‌గా తినడం, గుండె సంబంధిత సమస్యలు తెచ్చిపెడుతుందట. ఇప్పటికే హార్ట్ పేషంట్ అయిఉంటే, తొందరగా చనిపోయే అవకాశం ఉందని ఓ పరిశోధన చెప్పింది. ‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ’ అనే పత్రికలో ఈ పరిశోధనావ్యాసం ప్రచురించబడింది.
ఈ పరిశోధన చెప్పిందాని ప్రకారం, అటువంటి అనారోగ్యకర జీవనశైలి ఉంటే మాత్రం, తొందరగా మరణించే అవకాశం నాలుగు నుంచి అయిదు రెట్లు ఎక్కువగా ఉంటుందట. ఒకవేళ ఈపాటికే ఒకసారి గుండెపోటు వచ్చిఉంటే కనుక, రెండో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ రెండురకాల ఆహారపు అలవాట్లు విడిగా కూడా గుండెపోటుకు కారణమే అయినా, రెండూ కలిసిఉంటే మాత్రం పరిస్థితి తీవ్రమవుతుందని తమ పరిశోధనలో తేలిందని ఆ వ్యాస రచయిత మార్కస్ మినికుచి తెలిపారు.
ఈ పరిశోధనాబృందం 113 మంది 60 ఏళ్ల సగటు వయసు గల పేషంట్లను పరీక్షించింది. ఇందులో 73శాతం మగవాళ్లు. ఈ బృందం పరిశోధన కోసం తీసుకున్న వారందరూ కూడా గుండెపోటుతో బాధపడుతున్నవారే. వారి అహారపు అలవాట్లపై పరిశోధన జరగడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఇందులో అల్పాహారం తీసుకోనివారు 58 శాతం ఉండగా, రాత్రి లేట్‌గా భోజనం చేసేవారు 51 శాతం ఉన్నారు. కాగా, ఈ రెండు దురలవాట్లు ఉన్నవారు 48 శాతం ఉన్నారు. వీళ్లే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ప్రజలు తన ఆహారపు అలవాట్లను తొందరగా మార్చుకోవాలని, అలాగే రాత్రి భోజనానికి, పడుకోవడానికి మధ్య ఖచ్చితంగా రెండు గంటల ఎడం ఉండాలని పరిశోధకులు స్పష్టం చేశారు. కొవ్వులేని పాలు, పెరుగు లాంటి పాలపదార్థాలు, గోధుమ చపాతీ లేదా బ్రెడ్ లాంటి పిండిపదార్థాలు, పండ్లు… వీటిని ఉదయపు అల్పాహారంగా తీసుకోవడం మంచిదని వారి సలహా.