Juices For Blood : మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో రక్తహీనత సమస్య కూడా ఒకటి. రక్తహీనత సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజూరోజుకు ఎక్కువవుతుంది. రక్తహీనత కారణంగా నీరసం, తలతిరగడం, జుట్టు రాలడం, ఉత్సాహంగా పనిచేయలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం వంటి వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. రక్తహీనత సమస్య ముఖ్యంగా స్త్రీలల్లో తలెత్తుతుంది. నెలసరి సమయంలో బ్లీడింగ్ కారణంగా రక్తం ఎక్కువగా పోతూ ఉంటుంది. శరీరం నుండి వెళ్లే రక్తం ఎక్కువగా ఉండడం, తిరిగి శరీరంలో తయారయ్యే రక్తం తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.
అలాగే రక్త మొలల సమస్యతో బాధపడే వారిలో, ప్రేగుల్లో పురుగులు ఉన్న వారిలో, పోషకాహార లోపం ఉన్న వారిలో కూడా ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా మంది ఐరన్ ట్యాబ్లెట్లను, సిరప్ లను తాగుతూ ఉంటారు. మందులు వాడే పని లేకుండా సహజ సిద్దంగా లభించే నాలుగు ఆహారాలను తీసుకోవడం వల్ల మనం రక్తహీనత సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్త్రీలల్లో 12 నుండి 14 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. అలాగే పురుషుల్లో 14 నుండి 16 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. రక్తం తయారవ్వాలంటే శరీరంలో తగినంత ఐరన్ ఉండాలి. స్త్రీలకు రోజుకు 30 మిల్లీ గ్రాముల ఐరన్ అవసరమవుతుంది.
శరీరంలో ఉండే ఐరన్ నుండే రక్తం ఉత్పత్తి అవుతుంది. కొత్త రక్తకణాలు పుడుతూ ఉంటాయి. అలాగే అవి ఎక్కువ రోజుల పాటు ఆరోగ్యంగా జీవించి ఉంటాయి. ఎర్ర రక్తకణాల జీవిత కాలం 120 రోజులు ఉంటుంది. చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటే ఎర్ర రక్త కణాలు 120 రోజుల పాటు జీవించి ఉంటాయి. లేదంటే ముందుగానే చనిపోతాయి. దీంతో రక్తహీనత సమస్య తలెత్తుంది. రక్తహీనత సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ మన శరీరంలో తగినంత ఐరన్ ఉండడం చాలా అవసరం. రక్తహీనత సమస్యతో బాధపడే వారు రోజూఉదయం పూట క్యారెట్ జ్యూస్ ను తాగాలి. రక్తం తయారవ్వడానికి క్యారెట్ జ్యూస్ ఎంగానో ఉపయోగపడుతుంది. ఒక జార్ లో రెండు క్యారెట్ లు, ఒక కీరదోస, రెండు టమాటాలు, ఒక చిన్న బీట్ రూట్ వేసి జ్యూస్ గా చేయాలి.
తరువాత ఈ జ్యూస్ ను వడకట్టి దానికి ఎండు ఖర్జూరాల పొడిని కలపాలి. అలాగే రెండు టీ స్పూన్ల తేనెను కలపాలి. ఇలా తయారు చేసుకున్న క్యారెట్ జ్యూస్ ను తాగడం వల్ల రక్తహీనత సమస్య తగ్గడంతో పాటు నీరసం తగ్గుతుంది. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. అలాగే సాయంత్రం పూట బత్తాయి జ్యూస్, కమలా పండ్ల జ్యూస్ తాగాలి. ఇవి అందుబాటులో లేని వారు చెరుకు రసం, దానిమ్మ జ్యూస్, పైనాపిల్ జ్యూస్ వంటి వాటిని ఒక గ్లాస్ మోతాదులో తీసుకోవాలి. అలాగే ఈ జ్యూస్ లను నీరు తాగినట్టు తొందరగా తాగకూడదు. కొద్ది కొద్దిగా చప్పరిస్తూ 5 నుండి 10 నిమిషాల వరకు తాగాలి. రక్తహీనత సమస్యతో బాధపడే వారు సాయంత్రం పూట భోజనాన్ని తినకుండా ఆ స్థానంలో ఎండు ఖర్జూరాలను, అంజీరాలను, ఎండు ద్రాక్షను తీసుకోవాలి. వీటితో పాటు నచ్చిన పండ్లను, కాలానుగుణంగా లభించే పండ్లను ఆహారంగా తీసుకోవాలి.
అదే విధంగా ఆకుకూరల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలను వీలైనంత ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలి. ఇవి అందుబాటులో లేని వారు ఏదో ఒక ఆకుకూరను తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. అలాగే ఈ ఆకుకూరలను ఎక్కువ మొత్తంలో తీసుకునే ప్రయత్నం చేయాలి. వారానికి ఆరు రోజులు ఆకుకూర తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఉదయం పూట క్యారెట్ జ్యూస్ ను, మధ్యాహ్నం ఆకుకూరలను, సాయంత్రం ఫ్రూట్ జ్యూస్ ను, రాత్రి పూట డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.