Jonna Paratha : జొన్న పిండితో ప‌రాటాలు.. త‌యారీ ఇలా.. షుగ‌ర్‌, బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు..!

Jonna Paratha : బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ర‌క‌ర‌కాల ఆహార ప‌ద్ద‌తులు పాటిస్తూ ఉంటారు. బ‌రువు త‌గ్గాల‌నే ఉద్దేశ్యంతో నోటికి రుచిగా లేని ఆహార ప‌దార్థాల‌ను తీసుకుంటూ ఉంటారు. ఇలా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు నోటికి రుచిగా కూడా పరాటాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. జొన్నపిండితో చేసే ఈ ప‌రాటాలు రుచిగా ఉండడంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. రుచిగా, సుల‌భంగా జొన్న ప‌రాటాల‌ను ఎలా తయారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

జొన్న ప‌రాటా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జొన్న పిండి – ఒక క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1( చిన్న‌ది), క్యారెట్ తురుము – పావు క‌ప్పు, కీర‌దోస తుర‌ము- పావు క‌ప్పు, త‌రిగిన మెంతికూర – ఒక క‌ట్ట‌, ప‌చ్చిమిర్చి – 3, అల్లం – ఒక‌టిన్న‌ర ఇంచు ముక్క‌, వాము – పావు టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

Jonna Paratha recipe in telugu very healthy and tasty
Jonna Paratha

జొన్న ప‌రాటా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో జొన్న పిండిని తీసుకోవాలి. త‌రువాత అల్లాన్ని, ప‌చ్చిమిర్చిని మెత్త‌గా దంచి వేసుకోవాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. ఈ వేడి నీటిని జొన్న పిండిలో కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి. ఈ పిండిని చ‌పాతీ పిండి కంటే మెత్త‌గా క‌లుపుకుని ప‌ది నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత మందంగా ఉండే ఒక కాట‌న్ వ‌స్త్రాన్ని తీసుకుని నీటిలో ముంచి నీటిని పిండేసి తీసుకోవాలి. ఈ కాట‌న్ వ‌స్త్రాన్ని ప్లేట్ లేదా చ‌పాతీ పీట మీద వేసుకోవాలి. ఇప్పుడు త‌గినంత పిండిని తీసుకుని చేతికి త‌డి చేసుకుంటూ ప‌లుచ‌గా వత్తుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి.

పెనం వేడ‌య్యాక దానికిక నూనె రాయాలి. త‌రువాత ప‌రాటాను కాట‌న్ వస్త్రంతో స‌హా పెనం మీద వేసి కాట‌న్ వ‌స్త్రాన్ని తీసి వేయాలి. త‌రువాత ఈ ప‌రాటాకు కూడా జొన్న రొట్టె మాదిరి నీటితో త‌డి చేయాలి. త‌రువాత కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి మూత పెట్టి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. ప‌రాటా ఒక వైపు కాలిన త‌రువాత మ‌రో వైపుకు తిప్పుకుని నూనె వేసి కాల్చుకోవాలి. ప‌రాటా రెండు వైపులా చ‌క్క‌గా కాలిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న ప‌రాటా త‌యార‌వుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఇలా నోటికి రుచిగా ప‌రాటాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts