హెల్త్ టిప్స్

మీకు తెలియని గ్రీన్‌ టీ ఉపయోగాలు

గ్రీన్‌ టీని చాలామంది ఇష్టపడకపోవచ్చు. పొద్దున్నే సంప్రదాయ పద్దతిలో ఉండే చాయ్‌ తాగే అలవాటు ఏళ్ల తరబడి ఉండిఉంటుంది. పొగలు కక్కుతుండే వేడివేడి టీ తాగితే ఆ మజాయే వేరు అనుకునేవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ప్రస్తుత తరంలో శరీరం మన తాతతండ్రుల్లా ధృఢంగా ఉండడంలేదు. దానికి ఎన్నో కారణాలు. ఏదేమైనా బతికింతకాలం ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా అవసరం.

గ్రీన్‌ టీ గురించి మనకు తెలియని ఉపయోగాలు, లాభాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం విజృంభిస్తున్న ఎన్నోరకాల వ్యాధులను అది ముందే రాకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా రోజూ రెండో మూడో కప్పుల గ్రీన్‌ టీ తీసుకుంటే ఆరోగ్యంగా, ఆనందంగా జీవించచ్చు. గ్రీన్‌ టీ వల్ల మన దరికి చేరని కొన్ని వ్యాధులు, రుగ్మతల గురించి తెలుసుకుందాం.

1. రకరకాల క్యాన్సర్లు

క్యాన్సర్‌ రాకుండా తీసుకునే ముందుజాగ్రత్తల్లో గ్రీన్‌ టీ పాత్ర గురించి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ, ఫలితాలు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. గ్రీన్‌ టీలో ఉండే పాలీఫినాల్స్‌, కాన్పర్‌ కణాలను చంపడం, విస్తరించకుండా ఆపడంలో ప్రధానపాత్ర పోషిస్తాయని పరిశోధకుల అభిప్రాయం.బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కలిగిన 472 మంది మహిళలపై జరిపిన పరిశోధనలో, గ్రీన్‌ టీ తరచుగా తీసుకున్న వారిలో క్యాన్సర్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. 35 వేల మంది ఆడవాళ్లలో గ్రీన్‌ టీ తాగేవాళ్లకు కొలన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం 30శాతం తగ్గినట్టుగా ప్రయోగాలు తేల్చాయి.

2. హృదయాన్ని పదిలంగా ఉంచుతుంది

గ్రీన్‌ టీలో సమృద్ధిగా ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటాక్సిడెంట్లు పలు రకాల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి. చెడ్డ కొలెస్టరాల్‌ పెరిగే వేగాన్ని తగ్గించడం, రక్తం గడ్డకట్టకుండా నిరోధించడం, రక్తనాళ పనితీరును మెరుగుపర్చడం వంటి గుణాలు గ్రీన్‌ టీలో ఉన్నాయి. రోజూ ఒకటో రెండో కప్పుల గ్రీన్‌ టీ తాగేవారిలో రక్తనాళాలు కుంచించుకుపోవడం 46శాతం తగ్గుతుందని పరిశోధనల్లో బయటపడింది. మూడు కప్పులకు పెంచిన వారికి గుండెపోటు వచ్చే అవకాశం 43 శాతం తగ్గినట్టు, గుండెపోటుతో చనిపోయే అవకాశం 70 శాతం తగ్గిస్తుందని తేలింది.

many wonderful health benefits of green tea take daily know them

3. అర్థరైటిస్‌ను రానీయదు

గ్రీన్‌ టీలో కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు తగ్గించుకోవాలంటే రోజూ నాలుగు కప్పుల గ్రీన్‌ టీ తాగితే చాలు. ఇందులో పుష్కలంగా ఉండే క్వెర్సెటిన్‌ అనే రసాయన పదార్థం నొప్పిని తగ్గించే దివ్యౌషధం. పైగా చాలా యాంటాక్సిడెంట్లు కూడా ఉంటాయి. రోజూ గ్రీన్‌ టీ తాగేవాళ్లకు రుమటాయిడ్‌ అర్థరైటిస్‌ వచ్చే అవకాశాలు 60 శాతానికి పైగా తగ్గుతాయని వెస్టరన్‌ రిజర్వ్‌ విశ్వవిద్యాలయం తన పరిశోధనలో తేల్చింది.

4. మేధోశక్తిని వృద్ధి చేస్తుంది

గ్రీన్‌ టీలో సమృద్ధిగా ఉండే నెదర్లాండ్స్‌ పరిశోధకులు గ్రీన్‌ టీలో ఉండే రెండు రసాయన సమ్మేళనాలు, ఎల్‌-థియనైన్‌, కెఫీన్‌లు మస్తిష్కంలో జాగరూకత, అప్రమత్తతను పెంచుతాయని రూఢీ చేసారు. ఇతర శక్తి పానీయాల కంటే ఇందులో కెఫీన్‌ తక్కువగా ఉండటం వల్ల ఆతృత, కంగారు తగ్గుతాయని వారు తెలిపారు. అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌ వివరాల ప్రకారం, 55 అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు, రోజు ఒక కప్పు గ్రీన్‌ టీ తాగితే వారి మేధోశక్తి క్షీణించడం 38 శాతం తగ్గుతుందని తెలిసింది. అదే రెండో కప్పు కూడా తాగితే, మేధోశక్తి క్షీణత 58 శాతానికి తగ్గుతుందట.

5. మొటిమలను మాయం చేస్తుంది

మియామీ యూనివర్సిటీ స్టడీ ప్రకారం, కొద్ది మోతాదులో గ్రీన్‌ టీ తీసుకున్నా, అందులోని సూక్ష్మక్రిమి వ్యతిరేక రసాయనాలు, యాంటాక్సిడెంట్లు, మూడింట రెండు వంతుల మొటిమలను తగ్గించేస్తాయని తెలిసింది. ఇది రోజుకు రెండుసార్ల చొప్పున ఆరు వారాల పాటు తాగితే తేలిన నిజం. ఇంకా త్వరగా తగ్గాలంటే, గ్రీన్‌ టీని చల్లార్చి, దాన్ని ఫేస్‌ వాష్‌గా ఉపయోగించినా, లేదా ఆ టీ బ్యాగును నేరుగా మొటిమలపై కాసేపు ఉంచినా ఫలితం ముందుగా, ఇంకా మెరుగ్గా ఉండే అవకాశముంది. జిడ్డు చర్మం కలవారు, గ్రీన్‌ టీలో కొంచెం పుదీనా టీని కలిపి ఫేస్‌వాష్‌గా వాడితే జిడ్డు కూడా తొలిగిపోతుంది.

6. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది.

రోజుకి రెండు మూడు కప్పుల గ్రీన్‌ టీకి మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ను (యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌) తగ్గించే గుణమున్నది. గ్రీన్‌ టీలో ఉండే యాంటాక్సిడెంట్లు మూత్రాశయ వాపును రూపుమాపుతాయి. మరో పరిశోధన ప్రకారం, రోజూ గ్రీన్‌ టీ అలవాటుగా తాగేవారికి యూటీఐ వచ్చే అవకాశాలు 40 శాతం తగ్గుతాయట.

7. అలర్జీల నుండి రక్షిస్తుంది.

గ్రీన్‌ టీలో ఉండే యాంటాక్సిడెంట్లు, వృక్ష రసాయనాలకు వాపు, మంటల నుండి ఉపశమనం అందించే లక్షణం ఉంది. రకరకాల అలర్జీల వల్ల బాధపడేవారు, రోజూ గ్రీన్‌ టీ తాగితే అద్భుత ఫలితాలుంటాయి. ఇది సైనసైటిస్‌ సమస్యను కూడా దూరం చేస్తుంది.

8. కళ్ల ఉబ్బును, నల్లని వలయాలను తగ్గిస్తుంది.

కళ్లు ఉబ్బడం, నల్లని చారలు చుట్టూ ఏర్పడటం వంటివి చాలా చికాకును కలిగిస్తాయి. చూసేవారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. దీన్నుంచి విముక్తి పొందాలంటే మీరు గ్రీన్ టీని ఆశ్రయించాల్సిందే. రెండు నానిన గ్రీన్‌ టీ బ్యాగులను కళ్ల మీద పెట్టుకుని పదిహేను నుండి ఇరవై నిముషాలుంటే చాలు. కళ్ల చుట్టూ ఉబ్బిన కణజాలాన్ని యధాస్థితికి చేర్చి, కంటికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొన్ని రోజుల పాటు వాడితే నల్లని వలయాలు కూడా క్రమంగా మాయమవుతాయి.

9. అస్థమా లక్షణాలను తగ్గిస్తుంది

గ్రీన్‌ టీలో ఉండే యాంటాక్సిడెంట్‌ క్వెర్సిటిన్‌, మాస్ట్‌ కణాలనుండి విడుదలయ్యే వాపు, మంట రసాయనాలను సమర్థవంతంగా నిరోధిస్తుంది. ఈ మాస్ట్‌ కణాలే అస్థమా, అలర్జీ లక్షణాలను పెంచి పోషిస్తాయి. ఈ క్వెర్సిటిన్‌ పనిచేసినట్లే, కొన్ని రకాలైన అస్థమా మందులు కూడా పనిచేస్తాయి.

10. ఒత్తిడిని నిరోధిస్తుంది.

గ్రీన్‌ టీ వల్ల కలిగే ఇంకో లాభమేంటంటే, ఇతర టీల కన్నా దీన్లో తక్కువగా ఉండే కెఫీన్‌ మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో ఉపకరిస్తుంది. జపాన్‌ తొహుకు యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థులతో రోజుకు ఐదు కప్పుల గ్రీన్‌ టీ తాగించి చేసిన ప్రయోగంలో ఈ విషయం బయటకు తెలిసింది. అయితే, గ్రీన్‌ టీ లోని ఏ రసాయనం మనుషుల్లో ఒత్తిడిని తగ్గిస్తోందో తెలియనప్పటికీ, జంతువుల్లో మాత్రం హాయిని, నిద్రావస్థను కలిగించే ఇజిసిసి అనే సమ్మేళనం పనిచేసిందని కనుగొన్నారు. ఇది శరీరంలో విడుదలయ్యే ఒత్తిడి రసాయనాలను అణిచివేస్తుందని తెలిపారు.

11. పుష్కలంగా యాంటాక్సిడెంట్లు

గ్రీన్‌ టీలో ఉన్నన్ని యాంటాక్సిడెంట్లు ప్రపంచంలోని ఏ ఆహారపదార్థాలలో ఉండవు. 22 రకాల కూరగాయలు, పండ్లతో గ్రీన్‌ టీని, బ్లాక్‌ టీని పోల్చి చూసినప్పుడు, అయిదు నిమిషాలు మరగబెట్టిన గ్రీన్‌ టీ నమ్మలేని ఫలితాలనిచ్చింది. ఆ అన్ని రకాల ఆహారాలను తోసిరాజని, గ్రీన్‌ టీ పుష్కలంగా యాంటాక్సిడెంట్లను అందించింది. టఫ్ట్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించి, ఫలితాన్ని వెల్లడించారు. శరీరంలో యాంటాక్సిడెంట్లు నిర్వహించే పాత్ర అంతాఇంతా కాదు. రక్తంలో తిరుగాడే రోగకారక స్వేచ్చాణువులను తటస్థపరిచి, నిర్మూలించి రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరచడం వీటి ప్రధాన బాధ్యత.అంతేకాదు, కణాల్లో ఉండే డిఎన్‌ఏను క్యాన్సర్‌కారక మార్పులనుండి రక్షించే ఈజిసిసి గ్రీన్‌ టీలో ఉంటుంది. అందుకే క్యాన్సర్‌ నిరోధక పద్ధతుల్లో గ్రీన్‌ టీ సేవనం ముందుంటుంది.

Admin