Phool Makhana Side Effects : సూపర్ మార్కెట్లలో చాలా మంది తామర గింజలను చూసే ఉంటారు. వీటినే ఫూల్ మఖనాలుగా విక్రయిస్తుంటారు. ఇవి ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. కానీ వీటిని తింటే కలిగే ప్రయోజనాలు అద్భుతం అనే చెప్పాలి. ఫూల్ మఖనాలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కనుక వీటిని పోషకాలకు గనిగా చెబుతారు. వీటిని చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తింటుంటారు. ఇవి శరీరానికి బలాన్ని అందిస్తాయి. పోషణను ఇస్తాయి. రోగాలు రాకుండా చూస్తాయి. కనుక ఫూల్ మఖనాలను తింటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇవి మనకు లాభాలను అందించినప్పటికీ వీటిని అధికంగా మాత్రం తినరాదు. అలా తింటే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. వీటిని అధికంగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫూల్ మఖనాలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఆహారం అని చెప్పవచ్చు. అలాగే వీటిల్లో ప్రోటీన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. కనుక ఇవి మనకు సంపూర్ణ పోషణను అందిస్తాయని చెప్పవచ్చు. వీటిల్లో క్యాలరీలు తక్కువగా ఉండడం, ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల వీటిని తింటే మన బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా తక్కువ ఆహారం తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
ఫూల్ మఖనాలను తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఫూల్ మఖనాలను మోతాదులో మాత్రమే తినాల్సి ఉంటుంది. ఎక్కువగా తినరాదు. వీటిని ఎక్కువగా తినడం వల్ల పలు దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఫూల్ మఖనాలను ఎక్కువగా తింటే కొందరిలో మలబద్దకం ఏర్పడవచ్చు.
అలాగే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కొందరిలో విరేచనాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఫూల్ మఖనాలను మోతాదుకు మించి తింటే శరీరంలో క్యాల్షియం ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో కిడ్నీ స్టోన్లు, గౌట్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. వీటిని అతిగా తినడం వల్ల కొందరికి అలర్జీలు కూడా రావచ్చు. కనుక ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫూల్ మఖనాలను తినడం మానేయాలి. అనారోగ్య లక్షణాలు తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇక ఫూల్ మఖనాలను మోతాదులో తింటే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురు కావు. వీటి వల్ల పైన తెలిపిన విధంగా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.