Rama Tulasi Vs Krishna Tulasi : తులసిని మనం ప్రతి రోజు పూజిస్తాము. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆరోగ్య పరంగా తులసిని ఎక్కువగా వాడుతున్నారు. తులసిలో ఎన్నో రకాలు ఉన్నప్పటికి కృష్ణ తులసి, రామ తులసి.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. రామ తులసి పూజ కొరకు మరియు ఔషధ గుణాలకు చాలా ప్రసిద్ది చెందింది. ఈ తులసి ఆకులు ఇతర రకాల తులసి కంటే తియ్యని రుచిని కలిగి ఉంటాయి.
ఇక కృష్ణ తులసి విషయానికి వస్తే ముదురు ఆకుపచ్చ/ఊదా రంగు ఆకులు మరియు ఊదా రంగు కాండం కలిగి ఉంటుంది. ఇది కొంచెం చేదు రుచిని కలిగి ఉంటుంది. రెండు రకాల తులసి ఆకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే రామ తులసి జీర్ణ సమస్యలను తగ్గించి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి వాటి ఉపశమనం కొరకు సహాయపడుతుంది. క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంది.
కృష్ణ తులసి శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. జ్వరం, జలుబు మరియు దగ్గు సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు గుండె ఆరోగ్యానికి మరియు మధుమేహ రోగులకు కూడా మేలు చేస్తాయి. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు మెరిసేలా చేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడుతుంది.
రామ తులసి, కృష్ణ తులసి రెండూ కూడా మన ఆరోగ్యానికి మంచివే. రోజుకి మూడు ఆకులను పరగడుపున నమిలి తినవచ్చు. లేదంటే తులసి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. తులసి అనేది దాదాపుగా ప్రతి ఇంటిలో ఉంటుంది కాబట్టి తులసి ఆకులను తిని వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు.