Sabja Seeds : ప్రస్తుత కాలంలో అధిక బరువుతో బాధపడే వారు రోజు రోజుకీ ఎక్కువవుతున్నారు. పిల్లల్లో కూడా ఈ అధిక బరువు సమస్యను మనం చూడవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువగా కొవ్వు కలిగిన పదార్థాలను తినడం, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా అధికంగా బరువు పెరుగుతున్నారు. అధిక బరువు కారణంగా మనం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా అనేక రకాల రోగాల బారిన పడాల్సి వస్తుంది. అధిక బరువును ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలా మంది సతమతమవుతూ ఉంటారు. అధిక బరువు తగ్గడానికి రకరకాల వ్యాయామాలు, యోగాసనాలు, డైట్స్ వంటి వాటిని చేస్తూ ఉంటారు. వీటితోపాటు మన ఆహారంలో భాగంగా సబ్జా గింజలను తీసుకోవడం వల్ల మనం త్వరగా బరువు తగ్గవచ్చు.
సబ్జా గింజలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. సబ్జా గింజలు చిన్నగా నల్లగా ఉంటాయి. వీటిని నీటిలో వేయగానే సైజు పెరిగి తెల్లగా అవుతాయి. రోజూ సబ్జా గింజలను నీటిలో వేసి నానబెట్టి తినడం వల్ల లేదా వీటిని పండ్ల రసాలలో వేసుకుని తాగడం వల్ల కూడా మనం బరువు తగ్గవచ్చు. సబ్జా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. తద్వారా ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. ఇలా మనం చాలా సులువుగా బరువు తగ్గవచ్చు. ఆహార నియమాలను పాటించే వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
అంతేకాకుండా సబ్జా గింజలను తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది. సబ్జా గింజలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. శరీరంలో వేడిని తగ్గించడంలో సబ్జా గింజలు ఉపయోగపడతాయి. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. సబ్జా గింజలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల సాధారణ తలనొప్పి, మైగ్రేన్ వంటి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది.
అంతేకాకుండా సబ్జా గింజలను తీసుకోవడం వల్ల ఆస్తమా, తీవ్రమైన జ్వరం వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. ఆర్థరైటిస్, గుండె సంబంధిత సమస్యలను నయం చేయడంలో కూడా సబ్జా గింజలు మనకు సహాయపడతాయి. గాయాలు, పుండ్ల వంటి వాటిపై సబ్జా గింజల పొడిని నూనెతో కలిపి రాసుకోవడం వల్ల అవి త్వరగా మానుతాయి. సబ్జా గింజలను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు, బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా నెమ్మదిగా అదుపులోకి వస్తాయి. సబ్జా గింజలు మనకు కేవలం బరువు తగ్గడంలోనే కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.