Soaked Peanuts : మనలో చాలా మంది ఎత్తుకు తగిన బరువు ఉండరు. చాలా సన్నగా ఉంటారు. కండలు లేకుండా ఎముకలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా సన్నగా ఉన్న వారు బరువు పెరగడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా మంది బరువు పెరగడానికి జంక్ ఫుడ్ ను తీసుకుంటూ ఉంటారు. కానీ జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. కనుక సన్నగా ఉండే వారు బరువు పెరగాలి కానీ కొవ్వు పెరగకుండా కండ పెరిగే ఆహారాలను తీసుకోవాలి. కండ పెరిగి బరువును పెంచే ఆహారాలను తీసుకోవాలి. చాలా మంది సన్నగా ఉన్న వారు కండ పెరగడానికి మాంసాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే అందరు వీటిని తీసుకోలేరు. కేవలం మాంసం మాత్రమే కాకుండా ఇతర ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా సులభంగా బరువు పెరగవచ్చు.
ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల తక్కువ ఖర్చులో తక్కువ పమయంలో సులభంగా బరువు పెరగవచ్చు. బరువు పెరగాలనుకునే వారిలో అరుగుదల మరియు ఆకలి రెండు కూడా ఎక్కువగా ఉండాలి. మలబద్దకం సమస్య లేకుండా చూసుకోవాలి. బరువు పెరగాలనుకునే వారు ముందుగా రోజూ ఉదయాన్నే నీటిని తాగి సుఖ విరోచనం అయ్యేలా చూసుకోవాలి. తరువాత అల్పాహారంలో భాగంగా నానబెట్టిన పల్లీలను రెండు గుప్పెళ్ల మోతాదులో తీసుకోవాలి. తరువాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, మొలకెత్తిన గింజలు, 10 ఖర్జూర పండ్లను తీసుకోవాలి. అలాగే సపోటా, జామ,అరటి వంటి పండ్లను తీసుకోవాలి.
ఇలా అల్ఫాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల తగినంత ప్రోటీన్ లభిస్తుంది. అలాగే మధ్యాహ్నం వరకు నీటిని తాగుతూ ఉండాలి. మధ్యాహ్నం వరకు ఎటువంటి ఇతర ఆహారాలను తీసుకోకుండా ఉండాలి. తరువాత మధ్యాహ్నం ముడి బియ్యం అన్నం, జొన్న అన్నం, కొర్రల అన్నం వంటి వాటిని తీసుకోవాలి. అలాగే మధ్యాహ్న భోజనంలో అన్నం 60 శాతం, 20 శాతం ఆకుకూర పప్పు, 20 శాతం కూరలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడప్పుడూ సోయా గింజలు లేదా మీల్ మేకర్ తో కూర చేసి తీసుకోవాలి. ఇలా భోజనం చేసిన తరువాత మరలా సాయంత్రం 6 గంటల వరకు నీటిని తప్ప ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు.
ఇక సాయంత్రం 6 గంటలకు పుచ్చగింజలు పప్పు, ప్రొద్దు తిరుగుడు పప్పు, గుమ్మడి గింజలు పప్పు,బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా వంటి వాటిని నానబెట్టి తీసుకోవాలి. ఈ పప్పులల్లో 3 నుండి 4 రకాల పప్పులను తీసుకునే ప్రయత్నం చేయాలి. వీటిని తీసుకున్న తరువాత ఎక్కువ శక్తిని ఇచ్చే అరటి పండ్లు,సపోటా పండ్లు, సీతాఫలం వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఎండు ఖర్జూరాలను తీసుకోవాలి. సాయంత్రం 7 గంటల లోపు ఈ ఆహారాలను తీసుకుని మరలా ఉదయం వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఈ విధంగా మూడు పూటలా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా ఆరోగ్యంగా బరువు పెరగగలమని నిపుణులు చెబుతున్నారు.