మన దేశంలో ఏ పండగ వచ్చినా తయారు చేసే పిండివంటలలో నెయ్యి ప్రధానంగా ఉపయోగిస్తారు. నెయ్యి పంచామృతాలలో ఒకటి. నెయ్యి ప్రయోజనాలను పరిశీలిస్తే….దీనిని ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో ఏ మందు తినాలన్నా నేతితో కలిపి తింటారు. ఆహారంలో నేతిని కలిపితే తినే పదార్ధానికి మంచి రుచి చేకూరుతుంది. గతంలో డాక్టర్లు నెయ్యి గుండె జబ్బులను కలిగిస్తుందనుకునేవారు.
కాని అది సరి కాదని శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఆహారంలో లేకుంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని ఇటీవలే గ్రహించారు. నెయ్యికిగల పోషక లాభాలు – ఇది త్వరగా జీర్ణమవుతుంది. వేడినీటితో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గి మలబద్ధకం పోతుంది. నెయ్యిలో విటమిన్ ఎ, డి మరియు ఇ వుంటాయి. కనుక పిల్లలకు రొట్టెలు, అన్నం మొదలైన వాటిలో వేస్తారు.
నెయ్యిలో వున్న కొవ్వు విటమిన్లను గ్రహించి, నిల్వ వుంచి శరీరానికి అందిస్తుంది. పిల్లలలో మెదడు ఎదుగుదలకు సహకరిస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. గర్భవతులకు, పాలు ఇచ్చే తల్లులకు మంచి పోషకాహారం. వెన్నను సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. చర్మానికి రాస్తే మంచి కాంతి వస్తుంది. మెత్తపడుతుంది. ప్రతిరోజూ ఆహారంలో రెండు చెంచాల నెయ్యి కలుపుకు తింటే గుండె ఆరోగ్యానికి, శరీర పటుత్వానికి మంచిది.