Cold In Kids : ప్రస్తుత తరుణంలో చిన్న పిల్లలకు జలుబు చేయడం చాలా సాధారణం అయిపోయింది. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా బాధిస్తోంది. వాతవరణంలో యాక్టివ్ గా ఉండే వైరస్ లు ఇంకా వివిధ రకాల బ్యాక్టీరియా ల వలన ఇలాంటి వ్యాధులు వస్తాయి. ముక్కు దిబ్బడ, ముక్కులు కారడం, తమ్ములు, దగ్గు, గొంతు నొప్పి మొదలైనవి ఈ వైరస్ ల బారిన పడినప్పుడు కనిపించే లక్షణాలు. కొన్ని సందర్భాల్లో జ్వరం కూడా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. చిన్న పిల్లలకు ఇలాంటి వైరస్ లు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది. వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కనుక వారు త్వరగా ఇలాంటి రోగాల బారిన పడతారు. వయసు పెరిగే కొద్దీ వారిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
అయితే వైరస్ ల వలన కలిగే ఈ జలుబుకు కచ్చితమైన నివారణ చికిత్స లేదు. కానీ కొన్ని పద్దతులను పాటించడం ద్వారా దీని వలన ఏర్పడే ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గడానికి కనీసం 3 నుండి 4 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. ఇక చిన్న పిల్లలకు ఈ జలుబు వలన వచ్చే ఇబ్బందుల నుండి ఉపశమనం పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ఫెక్షన్లు సోకిన వెంటనే మొదటి రోజు యాంటీ బయాటిక్ మందులను వాడకూడదు. 48 గంటల తరువాత కూడా దగ్గు జలుబు తగ్గని పక్షంలో వైద్యుడి సలహా మేరకు యాంటీ బయాటిక్ మెడిసిన్ వాడాలని సూచిస్తున్నారు. జ్వరం ఉన్నప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ ను వాడవచ్చు. ఇది గొంతు నొప్పి తగ్గడానికి కూడా పని చేస్తుంది. 4 సంత్సరాల వయసు పైబడిన పిల్లలకు మామూలు దగ్గు, జలుబు మాత్రలను ఉపయోగించవచ్చు. కానీ 4 సంత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి వైద్యుడి సూచన లేకుండా దగ్గు, జలుబు ట్యాబ్లెట్లను ఇవ్వకూడదు. అలాగే డాక్టర్ సలహా లేకుండా నెబ్యులైజర్ ను కూడా వాడకూడదని హెచ్చరిస్తున్నారు.
ఇంకా ఆవిరి పట్టడం కూడా జలుబు లక్షణాలను తగ్గించడంలో సమర్ధవంతంగా పని చేస్తుందని చెబుతున్నారు. గది ఉష్ణోగ్రత వద్ద ఫ్యాన్ ఆఫ్ చేసి గోరు వెచ్చని నీటితో 10 నిమిషాల పాటు ఆవిరి పట్టడం వలన ముక్కు దిబ్బడ, ముక్కు కారడం నుండి ఉపశమనం పొందవచ్చు. ఊపిరితిత్తులు కూడా శుభ్ర పడి శ్వాస తీసుకోవడం సులువు అవుతుంది. అలాగే గొంతు సమస్యలకు వివిధ రకాల వేడిగా ఉండే సూప్ లను కూడా తాగించవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వలన వైరల్ ఇన్ఫెక్షన్ల వలన కలిగే దగ్గు, జలుబు సమస్యలనుండి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.