ఉరుకుల పరుగుల బిజీ జీవితం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు సగటు పౌరుడు అనేక సమస్యలతో సతమతం అవుతున్నాడు. దీని వల్ల తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాగే రోజూ దుమ్ము, ధూళి, కాలుష్యంలో గడపాల్సి వస్తోంది. దీంతో చర్మ సమస్యలు వస్తున్నాయి. అయితే చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు కింద తెలిపిన నూనెలను తరచూ వాడాల్సి ఉంటుంది.
పొడి చర్మం ఉన్నవారు ఆలివ్ నూనెతో మర్దనా చేసుకోవడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. చర్మం నిగారింపుతో కనిపిస్తుంది. ఎండవేడికి కమిలి, రంగు మారిన చర్మం తిరిగి పూర్వ స్థితికి వస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. ఆలివ్ నూనెతో మర్దనా చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. ఆలివ్ నూనెను తలకు పట్టించి కాసేపు మర్దనా చేస్తే తలనొప్పి తగ్గుతుంది. చుండ్రు తగ్గుతుంది.
చర్మ సంరక్షణకు కొబ్బరినూనె ఎంతగానో మేలు చేస్తుంది. కొబ్బరినూనెలో విటమిన్ ఇ ఉంటుంది. అందువల్ల చర్మం సంరక్షించబడుతుంది. కొబ్బరినూనెను వేడి చేసి గోరు వెచ్చగా ఉండగానే శరీరానికి రాసుకోవాలి. తరువాత కాసేపు మృదువుగా మర్దనా చేయాలి. అనంతరం స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. పొడిబారిన చర్మానికి తేమ లభిస్తుంది. పొడిబారిన చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుంది. కొబ్బరినూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. వయస్సు పెరగడం వల్ల వచ్చే ముడతలు రావు. ముడతలు తగ్గుతాయి. కళ్ల చుట్టూ రాస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. కొబ్బరినూనెను తలకు రాసుకుని మర్దనా చేయడం వల్ల శిరోజాలు త్వరగా రంగు మారవు. జుట్టు ఒత్తుగా పెరగడానికి కొబ్బరినూనె ఎంతగానో ఉపయోగపడుతుంది.
రోజూ ఉదయం స్నానానికి ముందు కొద్దిగా నువ్వుల నూనెను తీసుకుని ఒంటికి పట్టించి మర్దనా చేయాలి. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఒళ్లు నొప్పులు, తలనొప్పి తగ్గుతాయి. శరీరంపై కాలిన గాయాలు, ఎండవేడికి కమిలిన చర్మంపై నువ్వుల నూనెతో మర్దనా చేస్తే ఆయా భాగాల్లో చర్మం తిరిగి పూర్వ స్థితికి వస్తుంది. మేని ఛాయ మెరుగు పడుతుంది. నువ్వుల నూనెను తలకు రాసుకుని మర్దనా చేసి తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. నువ్వుల నూనెతో తలకు మర్దనా చేయడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమై మెదడు చురుగ్గా పనిచేస్తుంది. శిరోజాలు దృఢంగా పెరుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365