Warm Water Bath : శరీరాన్ని శుభ్రపరుచుకోవడానికి గానూ మనం రోజూ స్నానం చేస్తూ ఉంటాము. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రపడడంతో పాటు మనకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. కొందరు చల్లటి నీటితో స్నానం చేస్తే మరికొందరు వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. అయితే చల్లటి నీటి స్నానం కంటే వేడి నీటితో స్నానం చేయడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం కూడా వేడి నీటి స్నానం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల మనకు కలిగే అధిక ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేడి నీటితో స్నానం చేయడం వల్ల మన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. శరీరానికి శక్తిని ఇచ్చే సాధనంగా వేడి నీళ్ల స్నానం మనకు సహాయపడుతుంది.
అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేటప్పుడు వేడి నీటితో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ విడుదలను తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగించే ఎండార్ఫిన్ హార్మోన్ విడుదల అయ్యేలా చేయడంలో వేడి నీటి స్నానం మనకు సహాయపడుతుంది. అలాగే వేడి నీటితో స్నానం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. నిద్రలేమి తగ్గుతుంది. చక్కగా నిద్రపడుతుంది. శరీర లయ గాడి తప్పకుండా ఉంటుంది. ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడే వారు వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎతో మేలు కలుగుతుంది. ఆర్థరైటిస్, ఫైబ్రోమైయాల్జియా వంటి దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వారు వేడి నీటితో స్నానం చేయడం వల్ల నొప్పుల నుండి కొంత ఉపశమనం కలుగుతుంది.
అలాగే రోజూ రాత్రి పడుకోవడానికి ఒకటి లేదా రెండు గంటల ముందు వేడి నీటితో స్నానం చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. మనం ప్రశాంతమైన గాఢ నిద్రను సొంతం చేసుకోవచ్చు. రోజూ 40 నుండి 43 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఉండే వేడి నీటితో స్నానం చేయడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. అభిజ్ఞా పనితీరు, మానసిక స్థితి మెరుగుపడుతుంది. అదే విధంగా వేడి నీటి స్నానం వల్ల కండరాల ఒత్తిడి, నొప్పులు తగ్గుతాయి. వేడి నీటి స్నానం వల్ల రక్తనాళాల్లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో మనకు కండరాల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా వేడి నీటితో స్నానం చేయడం వల్ల మృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 26 నుండి 28 శాతం వరకు తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వేడి నీటి స్నానం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి రక్తప్రవాహం మెరుగుపడుతుందని తద్వారా గుండెపై ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. చర్మం పొడిబారడం, సొరియాసిస్, దురద వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈవిధంగా వేడి నీటి స్నానం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అయితే అధిక వేడిగా ఉండే నీటితో స్నానం చేయడం వల్ల చర్మంపై గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక మనం 36.7 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే నీటితో స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.