Chicken Tikka Masala : రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ టిక్కా మ‌సాలా.. ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

Chicken Tikka Masala : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో చికెన్ టిక్కా మ‌సాలా కూడా ఒక‌టి. చికెన్ తో చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ చికెన్ టిక్కా మ‌సాలాను రెస్టారెంట్ స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు, వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా రుచిగా చికెన్ టిక్కా మ‌సాలాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ టిక్కా మ‌సాలాను రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ టిక్కా మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 3( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), జీడిప‌ప్పు పేస్ట్ – 3 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – పావు టీ స్పూన్, నీళ్లు – ఒక క‌ప్పు, ఫ్రెష్ క్రీమ్ – పావు క‌ప్పు, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Chicken Tikka Masala recipe make like restaurant style
Chicken Tikka Masala

మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్ లెస్ చికె్ – పావుకిలో, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీలక‌ర్ర పొడి – పావు టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పొడి – ఒక టేబుల్ స్పూన్, క‌సూరిమెంతి – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

చికెన్ టిక్కా మ‌సాలా త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి. త‌రువాత మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి బాగా క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత చికెన్ ముక్క‌ల‌ను వేసి వీటిలో నీరంతా పోయి ద‌గ్గర ప‌డే వ‌ర‌కు వేయించాలి. చికెన్ ముక్క‌ల‌ను వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వీటిని కొద్దిగా చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత ఈ చికెన్ ముక్క‌ల‌ను స్టిక్స్ కు గుచ్చి మంట‌పై కాల్చుకోవాలి. వీటిని చుట్టూ కాల్చుకున్న త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని ప‌క్కకు ఉంచాలి. ఇప్పుడు మ‌రో క‌ళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత జీడిప‌ప్పు పేస్ట్ వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు కాల్చుకున్న చికెన్ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ టిక్కా మ‌సాలా త‌యార‌వుతుంది. ఇలా చాలా సుల‌భంగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా మ‌సాలాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts