Weight Loss Tips : అధిక బరువు సమస్యతో బాధపడే వారు బరువు తగ్గడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా బరువు తగ్గక ఇబ్బంది పడుతున్న వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. ఈ సమస్య బారిన పడడానికి కారణాలేవైనప్పటికి ఈ అధిక బరువు సమస్య ప్రస్తుతం మనల్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటని చెప్పవచ్చు. ఈ అధిక బరువు, స్థూలకాయం,శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్న వారు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల చాలా సులభంగా, చాలా ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి ఉపయోగపడే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువుతో బాధపడే వారు భోజనంలో అన్నానికి బదులుగా రెండు పుల్కాలను తీసుకోవాలి.
గోధుమ పిండి, జొన్న పిండి, రాగిపిండి లేదా మల్టీ గ్రెయిన్ పిండితో చేసిన పుల్కాలను తీసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యంతో వండిన అన్నాన్ని తినడం వల్ల 500 క్యాలరీల శక్తి లభిస్తుంది. పుల్కాలను తినడం వల్ల 140 నుండి150 గ్రాముల శక్తి లభిస్తుంది. త్వరగా బరువు తగ్గాలనుకునే వారు ముందుగా అన్నాన్ని తీసుకోవడం మానేయాలి. రెండు పుల్కాలను తినడం వల్ల కడుపు నిండిన భావన కలగదు. కనుక ఈ పుల్కాలను ఎక్కువ కూరతో తినాలి. ఆకుకూరలు, కూరగాయల్లో సహజంగా చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఈ కూరగాయల్లో మనం నూనె, ఉప్పు ఎక్కువగా వేసి కూరలు చేస్తూ ఉంటాం. దీంతో అవి అధిక క్యాలరీలు కలిగిన ఆహారాలుగా మారిపోతున్నాయి.
ఉప్పు, నూనెను ఎంత తక్కువగా ఉపయోగిస్తే మన శరీరానికి అంత మంచిది. కనుక ఉప్పు, నూనె తక్కువగా వేసి చేసిన కూరలను పుల్కాలతో కలిపి ఎక్కువగా తీసుకోవాలి. దాదాపు అర కిలో కూరలను తిన్నా కూడా మన శరీరానికి దాదాపు 150 కంటే తక్కువ క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. కూరగాయలను, ఆకుకూరలను ఎక్కవగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలగడంతో పాటు క్యాలరీలు కూడా శరీరానికి తక్కువగా అందుతాయి. దీంతో మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు సాయంత్రం భోజనంలో కేవలం పండ్లను మాత్రమే తీసుకోవాలి.
పండ్లను తీసుకోవడం వల్ల 400 క్యాలరీలు లభిస్తాయి. ఈ పండ్లను కూడా సాయంత్రం 7 గంటల లోపు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పండ్ల ద్వారా లభించే పడుకునే వరకు ఖర్చైపోతుంది. ఇక రాత్రి నుండి ఉదయం వరకు కావల్సిన శక్తిని శరీరం పేరుకుపోయిన కొవ్వు నుండి సేకరిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ విధంగా సాయంత్రం పూట పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే అధిక బరువుతో బాధపడే వారు ఉదయం పూట అల్పాహారంగా రెండు లేదా మూడు రకాల మొలకెత్తిన విత్తనాలను, పండ్లను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించడంతో పోషకాలు కూడా అందుతాయి. నీరసం రాకుండా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
వీటిని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తకుండా సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. ఈ విధంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆహారాన్ని తీసుకుంటూ రోజుకు రెండు గంటలు వ్యాయామం చేయాలి. ఆసనాలు, సూర్య నమస్కారాలు, వాకింగ్ వంటి వాటిని చేస్తూ ఉండాలి. రెండు గంటల పాటు వ్యాయామం చేయడం వల్ల సుమారు 700 నుండి 1000 క్యాలరీల వరకు ఖర్చవుతాయి. నిల్వ ఉన్న కొవ్వు నుండి మన శరీరం కావాల్సిన శక్తిని తీసుకుంటుంది. దీంతో శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఈ విధంగా ఆహారాన్ని తీసుకుంటూ, వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. దీంతో మనం చాలా సులువుగా, ఆరోగ్యవంతంగా బరువు తగ్గవచ్చు.