Eye Twitch : స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే మంచిది, పురుషులకు కుడి అదిరితే మంచిది అని అనడాన్ని మనం వినే ఉంటాం. కానీ దీనిని చాలా మంది నమ్మరు. మనకు వాస్తు శాస్త్రం లాగే శకున శాస్త్రం కూడా ఉంది. దాని ప్రకారం కేవలం కన్నే కాదు. పురుషులకు కుడి వైపు శరీర భాగం, స్త్రీలకు ఎడమ వైపు శరీర భాగం అదిరితే మంచిదంటారు. ప్రాచీన కాలం నుండి కొన్ని మంచిని పెంచితే కొన్ని శాస్త్రీయంగా నిరూపితం కానివి కూడా ఉన్నాయి. ఈ రెండో కోవకు చెందినవే మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలు ఎక్కువగా చదువుకోని వారిలో, గ్రామాల్లో కనిపిస్తాయి. ఒత్తిడి కారణంగా మనసులో మూఢ నమ్మకాలు ప్రభలుతాయి. జీవితం మీద అదుపు లేనట్లు భావిస్తే వారు ప్రపంచం పైన కొన్ని అభిప్రాయాలను రుద్దుతారు.
బయటికి వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే కాస్త కూర్చొని మంచినీళ్లు తాగి వెళ్లమని అంటారు. అంటే తుమ్ము రాబోయే ప్రమాదాన్ని చెబుతుందా. ఏదైనా చెడు జరిగితే మనకు రోజూ ఎవరో ఎదురొచ్చారు అని అనుకుంటాం. కొందరు కాకి తలమీద తన్నితే అది శని వాహనం కనుక మనకు శని పడుతుందని యముడి రూపంలో మరణం వస్తుందని భయపడతారు. కొందరు బల్లి మీద పడితే శకునం అని భావిస్తారు. ఇలాంటి మూఢ నమ్మకాలు మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఉంటాయి. జపాన్ లో తెల్లపాము ఎదురుపడితే అదృష్ట దేవత కనిపించదని భావిస్తారు. ఇక ఇండోనేషియాలో 9 అంకెను దురదృష్టంగా భావిస్తారు. ఇలాంటి ఎన్నో ఉంటూనే ఉంటాయి.
ఇలాంటి వాటిని నీటి మీద రాతలు అని కొందరు అంటే శాస్త్రాల్లో లిఖించబడిన రాతలు అని కొందరి బలమైన నమ్మకం. అలాగే కన్ను అదరడం వెనుక కూడా రామాయణానికి సంబంధించి ఒక బలమైన కథ ఉంది. శ్రీరాముడు వానర సేనను తీసుకుని రావణుడి మీదకు యుద్దానికి బయలుదేరినప్పుడు ఆ సమయంలో లంకలో ఉన్న రావణాసురిడికి, సీతమ్మ వారికి ఒకేసారి ఎడమ కన్ను అదిరిందట. ఆ తరువాత రాముడు సీతను రావణాసురిడి చెర నుండి విడిపించాడు.
ఈ ఫలితం ముందుగానే శుభసూచకంగా సీతమ్మ వారికి తెలిపింది. ఆ సమయంలో రావణాసురిడికి ఎడమ కన్ను అదిరిన ఫలితం కీడు జరిగింది. ఇదే కన్ను అదిరే వెనుక ఉన్న అసలు నిజం. ఆ రోజు నుండి స్త్రీలకు ఎడమ కన్ను, పురుషులకు కుడి కన్ను అదిరితే మంచి శకునంగా భావిస్తారు. అయితే శరీర భాగాలు అదిరిన ప్రతిసారి మనకు మంచి జరుగుతుందని అనుకోవడానికి లేదు. వాస్తవానికి మన శరీర భాగాలు అదరడానికి అనేక కారణాలు ఉంటాయి. కొందరు ఉదయం నుండి రాత్రి వరకు అదిరింది అంటారు.
కొందరిలో శరీర భాగాలు తరచూ అదురుతాయి. అది నరాల బలహీనతకు సూచన. ఆయుర్వేదం ప్రకారం వాత, పిత గుణాలు ప్రకోచించినప్పుడు శరీర భాగాలు అదురుతుంటాయి. ఇక కంటి సంబంధిత సమస్యలు ఉన్నా కూడా కళ్లు తరచూ అదురుతాయి. అలాంటప్పుడు వైద్యున్ని సంప్రదించాలి కానీ కన్ను అదురుతుంది కదా మంచి జరుగుతుందని కూర్చోకూడదు.