Mushrooms : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయల్లో పుట్టగొడుగుల కూడా ఒకటి. ఇవి శిలీంధ్రాల జాతికి చెందుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పుట్టగొడుగులు ఎక్కువగా వర్షాకాలంలో లభిస్తాయి. వీటితో ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు. అయితే పుట్టగొడుగులను చాలా మంది తింటుంటారు. కానీ వాటికి సంబంధించిన ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. వాటిని తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పుట్టగొడుగుల్లో క్యాలరీలు, కొవ్వు తక్కువగా పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ డి, రైబోఫ్లేవిన్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్ వంటి బి కాంప్లెక్స్ విటమిన్లు, సెలీనియం, కాపర్, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. పోషకాహార లోపం రానివ్వకుండా చూస్తాయి. పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో కణజాలం నాశనం కాకుండా సురక్షితంగా ఉంటుంది. ఫలితంగా క్యాన్సర్లు రావు. అలాగే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
పుట్టగొడుగుల్లో బీటా గ్లూకాన్స్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రావు. పుట్టగొడుగులను తరచూ తీసుకునే వారిలో క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల ట్యూమర్లు వృద్ధి చెందవు. పుట్టగొడుగుల్లో ఉండే బీటా గ్లూకాన్స్, ఎరిటాడెనిన్ అనే సమ్మేళనాలు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
పుట్టగొడుగులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. పొట్టలో మంచి బాక్టీరియాను పెంచుతుంది. దీంతో జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా పుట్టగొడుగులతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ తినాలి. అయితే కొందరికి ఇవి పడవు. కనుక అలాంటి వారు వీటికి దూరంగా ఉండడమే మంచిది.