నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం.. అన్నాడో కవి.. అవును.. అది నిజమే. సాక్షాత్తూ వైద్యులే ఆ విషయాన్ని మనకు చెబుతున్నారు. నవ్వు వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లోనూ వెల్లడైంది. అందుకే ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని అందరూ అంటుంటారు. అయితే నిత్యం మనం 100 సార్లు నవ్వితే ఎంత ప్రయోజనం కలుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం..!
నిత్యం మనం 100 సార్లు గనక నవ్వితే అది 15 నిమిషాల పాటు సైకిల్ తొక్కడానికి సమానమట. అలాగే 10 నిమిషాలు రోయింగ్ మెషీన్‌పై వ్యాయామం చేసిన దాంతో సమానమట. అలాగే అది 30 నిమిషాల పాటు వాకింగ్ చేసిన దానికి, 15 నిమిషాల పాటు రన్నింగ్ చేసే దానికి సమానమట. దాంతో దాదాపుగా 100 నుంచి 150 క్యాలరీల వరకు ఖర్చవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు.
అలా నిత్యం 100 సార్లు గనక నవ్వితే వ్యాయామం కూడా చేయాల్సిన అవసరం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకనే బాగా నవ్వడం అలవాటు చేసుకోవాలని, ఒత్తిడి తగ్గించుకుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. నవ్వడం వల్ల మన శరీరానికి బాగా వ్యాయామం అవుతుందని, దాంతో అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.