మన శరీరంలో క్యాలరీలు ఖర్చయ్యే రేటునే మెటబాలిజం అంటారు. అంటే.. మెటబాలిజం ఎంత ఎక్కువ ఉంటే క్యాలరీలు అంత త్వరగా ఖర్చవుతాయి అన్నమాట. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన మెటబాలిజం కలిగి ఉండాలి. అది ఏ మాత్రం తగ్గినా మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మెటబాలిజం తగ్గితే.. క్యాలరీలు త్వరగా ఖర్చు కావు. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో అధిక బరువు పెరుగుతారు. అలాగే డయాబెటిస్, గుండె జబ్బులు కూడా వస్తాయి. కనుక మన శరీర మెటబాలిజం సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన ఆహారాలను నిత్యం మనం తీసుకోవాలి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
1. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల మన శరీర మెటబాలిజం రేటు 15 నుంచి 30 శాతం వరకు పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక ప్రోటీన్లు అధికంగా ఉండే కోడిగుడ్లు, చికెన్, మటన్, పప్పులు తదితర ఆహారాలను తినడం వల్ల మెటబాలిజాన్ని పెంచుకోవచ్చు. ఫలితంగా క్యాలరీలు కూడా త్వరగా ఖర్చయి అధిక బరువు తగ్గుతారు.
2. నీటిని అధికంగా తాగడం వల్ల కూడా శరీర మెటబాలిజం పెరుగుతుంది. 0.5 లీటర్ల నీటిని తాగితేనే మన శరీర మెటబాలిజం 10 నుంచి 30 శాతం వరకు పెరుగుతుంది. కనుక నిత్యం తగినంత నీటిని కూడా తాగాలి. దీంతో మెటబాలిజం గాడిలో పడుతుంది.
3. జిమ్‌లో వ్యాయామం చేస్తూ మజిల్స్‌ను పెంచుకున్నా మన శరీర మెటబాలిజం రేటు పెరుగుతుంది.
4. గంటల తరబడి ఒకే పొజిషన్‌లో కూర్చుంటే మన శరీర మెటబాలిజం తగ్గుతుంది. కనుక మధ్య మధ్యలో లేచి వాకింగ్ చేస్తూ ఉండాలి. మధ్యాహ్నం భోజనం తరువాత వాకింగ్ చేయడం వల్ల 174 క్యాలరీలు అదనంగా ఖర్చవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక భోజనం చేశాక కొంత సేపు వాకింగ్ చేస్తే మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
5. నిత్యం తాగే కాఫీ, టీ లకు బదులుగా గ్రీన్ టీ లేదా ఊలాంగ్ టీ లను తాగితే మన శరీర మెటబాలిజం 4 నుంచి 5 శాతం వరకు పెరుగుతుంది. అందుకనే గ్రీన్ టీ తాగితే త్వరగా బరువు తగ్గుతారు.
6. మసాలాలు, కారంలను అధికంగా తింటున్నా మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ముఖ్యంగా దాల్చిన చెక్క, లవంగాలు లేదా మిరియాలు, మిర్చి వంటివి తింటే మెటబాలిజం పెరుగుతుంది.
7. నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రపోవాలి. నిద్రలేకపోతే శరీర మెటబాలిజం తగ్గుతుంది. కనుక రోజూ తగినన్ని గంటల పాటు నిద్రిస్తే మన శరీర మెటబాలిజం సరిగ్గా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.
8. వంట నూనెల్లో ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనెలను వాడడం వల్ల కూడా మన శరీర మెటబాలిజం పెరుగుతుంది. కనుక నిత్యం వాడే సాధారణ వంట నూనెలకు బదులుగా ముందు చెప్పిన ఆ రెండు నూనెలను వాడితే అధిక బరువు కూడా తగ్గుతారు.
పైన చెప్పిన విధంగా నియమాలను పాటిస్తే మన శరీర మెటబాలిజాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. దీంతో బరువు అదుపులో ఉంటుంది. డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి..!