ప్రస్తుత తరుణంలో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు అందంపై దృష్టి సారిస్తున్నారు. అయితే అందం విషయానికి వస్తే వాటిలో ప్రముఖ పాత్ర పోషించేవి శిరోజాలు. అవును, అవే. ఆడవారికైతే జుట్టు రాలడం, మళ్లీ పెరగడం మామూలే కానీ మగవారికి మాత్రం అలా వెంట్రుకలు రాలడం మొదలైతే చివరకు అది బట్టతలకు దారి తీస్తుంది. పని ఒత్తిడి, కాలుష్యం, కెమికల్స్ ఉపయోగించి తయారు చేసిన షాంపూలు, దీర్ఘకాలిక వ్యాధులు… ఇలా కారణాలు ఏమున్నా మగవారిలో ఇప్పుడు బట్టతల చాలా తక్కువ వయస్సులోనే వస్తోంది. ఈ క్రమంలో కింద ఇచ్చిన పలు టిప్స్‌ను పాటిస్తే బట్టతల రాకుండా చర్యలు తీసుకోవచ్చు. అంతేకాదు, ఇప్పటికే ఊడిపోయిన జుట్టును తిరిగి పెరిగించేందుకు అవకాశం ఉంటుంది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొద్దిగా కుంకుమ పువ్వును తీసుకుని దాన్ని పాలలో బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే రాలిపోయిన జుట్టు మళ్లీ పెరుగుతుంది. నల్లమిరియాల పొడిలో కొద్దిగా నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. దీన్ని తలకు పట్టించాలి. ఇది బట్టతల రాకుండా చూస్తుంది. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కొబ్బరిపాలను తీసుకుని నేరుగా జుట్టుకు రాయాలి. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కొద్దిగా కొత్తిమీరను తీసుకుని దాన్ని బాగా నలిపి పేస్ట్‌లా చేసి ఆ పేస్ట్ నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని నిత్యం తలకు పట్టిస్తుంటే కొద్ది రోజులకు వెంట్రుకల పెరుగుదల మొదలవుతుంది. కాఫీ గింజలను తెచ్చి వాటిని పొడి చేయాలి. ఆ పొడిలో కొంత నీరు కలిపి పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. అనంతరం కొంత సేపు ఆగాక తలస్నానం చేయాలి. దీంతో జుట్టు బాగా పెరుగుతుంది. ఇది బట్టతలకు చక్కని టిప్‌గా పనిచేస్తుంది.
మెంతులను నీటిలో నానబెట్టి మెత్తని పేస్ట్‌లా చేయాలి. దీన్ని తలకు అప్లై చేసి కొంత సేపటి తరువాత స్నానం చేసేయాలి. ఊడిపోయిన వెంట్రుకలను తిరిగి మొలిపించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎండ బెట్టిన ఉసిరి కాయ ముక్కలు, కరక్కాయ ముక్కలు, తానికాయ ముక్కలను 10 చొప్పున తీసుకుని వాటిని రాత్రి నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని తలకు రాసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ఊడిపోయిన జుట్టు తిరిగి మళ్లీ మొలుస్తుంది. మందార పూలు, గోరింటాకు, కలబంద గుజ్జులను తీసుకుని మిశ్రమంగా చేయాలి. దీన్ని నల్ల నువ్వుల నూనెలో వేసి బాగా కషాయంలా కాయాలి. దీన్ని వడబోసి తలకు రాసుకోవాలి. ఇలా చేస్తుంటే వెంట్రుకలు బాగా పెరగడమే కాదు, నల్లబడతాయి కూడా. కరివేపాకు రసం, వెల్లుల్లి పొట్టులను పైన చెప్పినట్టుగా నల్ల నువ్వుల నూనెలో వేసి బాగా కాచి పెట్టుకుంటున్నా వెంట్రుకలు బాగా పెరుగుతాయి.