Orange Juice : ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగిన వాటిలో ఆరెంజ్ కూడా ఒకటి. ఆరెంజ్ జ్యూస్ ను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఆరెంజ్ జ్యూస్ అంటే మక్కువ ఎక్కువే. ఆరెంజ్ లో పొటాషియం, విటమిన్ ఎ, సి, కాల్షియం, థయామిన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే వైద్యులు మనకి ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆరెంజ్ జ్యూస్ నే తాగమని సిఫార్సు చేస్తారు. ఆరెంజ్ జ్యూస్ తాగడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గును నయం చేయడంలో కూడా ఇది ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి శక్తి లభిస్తుంది. హృదయ ఆరోగ్యానికి, ఎముకలు బలంగా ఉండడానికి, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి, రక్త శుద్ధికి ఆరెంజ్ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
కొంతమంది రోగులకు అనారోగ్య సమస్యలు కలిగినప్పుడు మలబద్దక సమస్య ఏర్పడుతుంది. అందువలన ఆరెంజ్ లో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నివారించి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటానికి సహకరిస్తుంది. అన్న వాహికలోని పెరిస్టాల్టిక్ ఆహార కదలికలను మెరుగుపరిచేలా చేస్తుంది. శరీరం నుండి వ్యర్ధాలను తొలగించి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
నారింజ రసంలో మలం మృదువుగా వచ్చేందుకు విటమిన్ సి, నరింగెనిన్ అనే ఫ్లెవనాయిడ్ భేది మందుగా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా కొంతమందిలో నారింజ రసం అతిసారానికి కారణమవుతుంది. ఇందులో ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్, సార్బిటాల్ వంటి వివిధ రకాల చక్కెరలను కలిగి ఉండటం వలన విరేచనాలతో బాధపడుతున్న వారిలో కడుపు నొప్పిని కలిగిస్తుంది. కనుక అలాంటి సమస్యలు ఉన్నవారు నారింజ జ్యూస్‌ను తాగరాదు. ఇక మిగిలిన ఎవరైనా సరే నారింజ జ్యూస్‌ను నిర్భయంగా తాగవచ్చు. దీంతో అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు.