Raw Mango : ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా వేసవి మండే ఎండలను మోసుకుని వచ్చింది. ఈ క్రమంలోనే వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. శరీరాన్ని చల్లబరుచుకునే మార్గాల వైపు చూస్తున్నారు. ఇక వేసవిలో మనకు ముందుగా లభించేవి మామిడికాయలు. ఈ సీజన్‌లో మనకు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. పసుపు, ఎరుపు రంగుల్లో ఉండే అనేక రకాల వెరైటీలకు చెందిన మామిడి పండ్లు మనకు లభిస్తుంటాయి. అయితే కేవలం మామిడి పండ్లే కాదు.. పచ్చి మామిడి కాయలను కూడా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. పచ్చి మామిడి కాయలను తినడం వల్ల కూడా మనకు అనేక లాభాలు కలుగుతాయి. వీటిని తింటే ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వేసవి కాలంలో మన శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా పచ్చి మామిడి కాయ జ్యూస్ కాపాడుతుంది. మన శరీరం సోడియం క్లోరైడ్ , ఐరన్ ను కోల్పోకుండా ఇది సహాయపడుతుంది. వేపవి కాలంలో ఎండ దెబ్బ వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. వ్యాయామం చేసిన తరువాత మంచి రిఫ్రెష్‌మెంట్ డ్రింక్‌లా పనిచేస్తుంది. పచ్చిమామిడి కాయ జ్యూస్‌ను తాగితే శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్, ఎండదెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తగ్గుతుంది.
2. పచ్చి మామిడి కాయల్లో విటమిన్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు.
3. పచ్చి మామిడి కాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అజీర్ణం, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
4. పచ్చి మామిడికాయల్లో మాంగిఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌తోపాటు మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. కనుక హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
5. పచ్చి మామిడి కాయల్లో పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రాకుండా చూస్తాయి. వాపులను తగ్గిస్తాయి. కణాలను సురక్షితంగా ఉంచుతాయి.
6. పచ్చి మామిడి కాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది దంతాలు, చిగుళ్ల సమస్యలను తగ్గిస్తుంది. చిగుళ్ల నుంచి కారే రక్త స్రావం తగ్గుతుంది. అలాగే రక్తహీనత నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది.
7. పచ్చి మామిడి కాయల్లో లుటీన్, జియాజాంతిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్లలోని రెటీనాను సంరక్షిస్తాయి. దీంతోపాటు కంటి చూపును మెరుగు పరుస్తాయి. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
8. పచ్చి మామిడి కాయలను తినడం వల్ల శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా నిరోధించ వచ్చు. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే చర్మానికి, జుట్టుకు మేలు చేసే పోషకాలు కూడా వీటిల్లో ఉంటాయి. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారి చర్మ సమస్యలు తగ్గుతాయి. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.
9. పచ్చి మామిడి కాయలను తినడం వల్ల లివర్ సమస్యలు తగ్గుతాయి. లివర్ లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గి లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్‌లోని కొవ్వు కరుగుతుంది.
10. పచ్చి మామిడికాయల్లో ఉండే ఫైబర్ అధిక బరువును తగ్గించగలదు. కనుక బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తింటే ఎంతో మేలు జరుగుతుంది.