Musk Melon Lassi : వేసవి కాలం వచ్చేసింది. ఈ కాలంలో ఉండే అధిక ఉష్ణోగ్రతల కారణంగా మన శరీరం నుండి నీరు ఎక్కువగా చెమట రూపంలో బయటకు పోతుంది. దీని వల్ల మనం డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం నీటిని తాగడం మాత్రమే కాకుండా నీటి శాతం అధికంగా కలిగిన పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము. దీనితో పాటుగా శరీరానికి కావల్సిన పోషకాలు కూడా అందుతాయి. నీటి శాతం అధికంగా కలిగిన పండ్లల్లో తర్బూజ ఒకటి. తర్బూజను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
పొటాషియం అధికంగా కలిగి ఉన్న వాటిల్లో తర్బూజ ఒకటి. ఈ పొటాషియం హైబీపీని నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది. తర్బూజలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. క్యాలరీలను తర్బూజ తక్కువగా కలిగి ఉంటుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్బూజను నేరుగా ముక్కలుగా చేసుకుని తినవచ్చు. తర్బూజతో జ్యూస్, లస్సీలుగా కూడా చేసుకొని తాగవచ్చు. మనలో చాలా మంది తర్బూజతో లస్సీని ఎక్కువగా తయారు చేయరు. కానీ ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు తర్బూజతో లస్సీ చేయడానికి కావలసిన పదార్థాలను, తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం.
తర్బూజ లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – అర లీటర్, తర్బూజ ముక్కలు – ఒకటిన్నర కప్పు, చక్కెర – పావు కప్పు, పుదీనా – కొద్దిగా, యాలకుల పొడి – పావు టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ – తగినన్ని.
తర్బూజ లస్సీ తయారు చేసే విధానం..
ముందుగా జార్ లో తర్బూజ ముక్కలు, చక్కెర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో పెరుగు, పుదీనా, యాలకుల పొడి, ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి మిక్సీ పట్టుకుంటే చల్ల చల్లని తర్బూజ లస్సీ తయారవుతుంది. ఈ లస్సీ చల్లగా ఉన్నపుడే చాలా రుచిగా ఉంటుంది. తర్బూజ లస్సీని తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము. శరీరంలో ఉండే వేడిని తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. తర్బూజలో అధికంగా ఉండే ఫైబర్ అజీర్తి సమస్యను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో తర్బూజ ఎంతో ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా తర్బూజ సహాయపడుతుంది.