Pudina Sharbat : వేసవి కాలంలో చాలా మంది తమ శరీరాన్ని చల్లబరుచుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో భాగంగానే చల్లని పానీయాలను ఎక్కువగా సేవిస్తుంటారు. అయితే శరీరానికి చల్లదనాన్నిచ్చే పానీయాలు అనేకం ఉన్నాయి. కానీ ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే పానీయాలు మాత్రం కొన్నే ఉన్నాయి. వాటిల్లో పుదీనా షర్బత్ ఒకటి. వేసవిలో ఇది మన శరీరాన్ని చల్లబరచడమే కాదు.. దీన్ని తాగడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో వచ్చే జీర్ణసమస్యలకు పుదీనా షర్బత్‌తో చెక్ పెట్టవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి పుదీనా షర్బత్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
పుదీనా షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుదీనా ఆకులు – ఒక కప్పు, తేనె – 1 టేబుల్ స్పూన్, సైంధవ లవణం – 1 టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి – 1 టీస్పూన్, నిమ్మరసం – 3 టేబుల్ స్పూన్లు, నీళ్లు – 1 గ్లాస్.
పుదీనా షర్బత్ తయారు చేసే విధానం..
పుదీనా ఆకులను తెంపి కాడలు లేకుండా చేసి వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో అన్ని పదార్థాలను వేసి బాగా గ్రైండ్ చేయాలి. మెత్తని పేస్ట్ లేదా ప్యూరీలా అయ్యే వరకు అన్నింటినీ బాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో పావు వంతు మాత్రమే తీసుకుని ఒక గ్లాస్‌లో వేయాలి. అనంతరం గ్లాస్ లో చల్లని నీళ్లను పోయాలి. తరువాత అవసరం అనుకుంటే బాగా కలపాలి. దీంతో చల్ల చల్లని పుదీనా షర్బత్ రెడీ అవుతుంది.
పుదీనా షర్బత్‌ను ఇలా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో ఉన్న వేడి మొత్తం పోతుంది. దీన్ని మధ్యాహ్నం సమయంలో భోజనం చేసిన అనంతరం ఒక గంట విరామం ఇచ్చి సేవించాలి. దీంతో శరీరంలోని వేడి తగ్గుతుంది. చల్లగా మారుతుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. అలాగే జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.