Bachalikura Pappu : బ‌చ్చ‌లికూరను ప‌ప్పుగా కూడా చేసి తిన‌వ‌చ్చు.. ఇలా చేయాలి..!

Bachalikura Pappu : మనం ఆహారంగా ర‌క‌ర‌కాల ఆకుకూర‌ల‌ను తీసుకుంటూ ఉంటాం. ఆకు కూర‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకు కూర‌ల్లో బ‌చ్చ‌లి కూర ఒక‌టి. అన్ని ఆకు కూర‌లలాగా బ‌చ్చ‌లి కూర కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో బ‌చ్చ‌లికూర ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. బ‌చ్చ‌లి కూర‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య త‌గ్గుతుంది. కంటి చూపు వృద్ది చెందుతుంది. మాన‌సిక ఒత్తిడిని త‌గ్గించ‌డంలో కూడా బ‌చ్చ‌లి కూర ఉప‌యోగ‌ప‌డుతుంది.

Bachalikura Pappu  very healthy cook in this method
Bachalikura Pappu

మ‌న‌కు తెల్ల బ‌చ్చ‌లి, ఎర్ర బచ్చ‌లి వంటి రెండు ర‌కాల బ‌చ్చ‌లి కూర‌లు ల‌భిస్తూ ఉంటాయి. బ‌చ్చ‌లి కూర‌ను వేపుడుగా, ప‌ప్పుగా కూడా చేసుకోవ‌చ్చు. బ‌చ్చ‌లి కూరతో చేసే ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. బ‌చ్చ‌లి కూర‌తో ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌చ్చ‌లి కూర ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బ‌చ్చ‌లి కూర – ఒక‌టిన్న‌ర క‌ప్పు , కంది ప‌ప్పు – ఒక క‌ప్పు, త‌రిగిన టమాటాలు – 4, చింత‌పండు – కొద్దిగా, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 10, నీళ్లు – త‌గిన‌న్ని, ఉప్పు – రుచికి త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్.

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండు మిర‌ప‌కాయ‌లు – 2, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, త‌రిగిన ఉల్లిపాయ – ఒక‌టి, క‌చ్చా ప‌చ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5.

బ‌చ్చలి కూర ప‌ప్పు త‌యారు చేసే విధానం..

ముందుగా ఒక కుక్క‌ర్ లో కందిప‌ప్పును వేసి శుభ్రంగా క‌డగాలి. త‌రువాత ఉప్పు, బ‌చ్చ‌లి కూర త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. ఇందులోనే త‌గినంత ఉప్పను వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి తాళింపు ప‌దార్థాల‌న్నింటినీ వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన త‌రువాత త‌రిగిన బ‌చ్చ‌లి కూరను వేసి క‌లిపి మ‌ధ్య‌స్థ మంట‌పై బ‌చ్చ‌లి కూర‌ను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించుకోవాలి. బచ్చ‌లి కూర ఉడికిన త‌రువాత ముందుగా ఉడికించిన ప‌ప్పును వేసి క‌లిపి 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ‌చ్చ‌లి కూర ప‌ప్పు త‌యార‌వుతుంది. ఈ ప‌ప్పును అన్నం, చ‌పాతీ, రాగి సంగ‌టి, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బ‌చ్చ‌లి కూర‌తో ఇలా ప‌ప్పును చేసుకుని తిన‌డం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది. పలు ర‌కాల క్యాన్స‌ర్ లు వ‌చ్చే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts