Bobbarlu : మనకు లభించే పప్పు ధాన్యాలలో బొబ్బెర్లు కూడా ఒకటి. వీటిని అలసందలు అని కూడా అంటుంటారు. బొబ్బెర్లను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)ను స్థాయిలను తగ్గించడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అధిక రక్త పోటును, షుగర్ ను నియంత్రించడంలో, బరువు తగ్గడంలో బొబ్బెర్లు సహాయపడతాయి. వీటిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో దోహదపడతాయి. పేగులలో కదలికలను పెంచి జీర్ణాశయ సమస్యలను తగ్గించడంలో వీటిలో అధికంగా ఉండే ఫైబర్ తోడ్పడుతుంది. బొబ్బెర్లతో మనం ఎక్కువగా గారెలను, గుగ్గిళ్లను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా బొబ్బర్లతో కూరను కూడా చేసుకోవచ్చు. బొబ్బెర్లతో చేసే కూర రుచిగా ఉండడమే కాకుండా దీనిని తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. బొబ్బెర్లతో కూరను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బొబ్బర్ల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
బొబ్బర్లు – 100గ్రా., తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన టమాటాలు – 2, నానబెట్టిన చింతపండు – 25 గ్రా., కారం – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
బొబ్బర్ల కూర తయారీ విధానం..
ముందుగా బొబ్బర్లను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లను పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బొబ్బర్లను మరోసారి కడిగి కుక్కర్ లో వేసి బొబ్బర్లకు సరిపడా ఉప్పును, తగినన్ని నీళ్లను పోసి మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలను వేసి కలిపి మూత పెట్టి టమాట ముక్కలను పూర్తిగా ఉడికించుకోవాలి.
టమాట ముక్కలు ఉడికిన తరువాత తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, ఎండు కొబ్బరి, చింత పండు గుజ్జు వేసి కలిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తరువాత మూత తీసి ఉడికించుకున్న బొబ్బర్లను నీళ్లతో సహా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లను పోసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచి చివరగా కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బొబ్బర్ల కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఈ విధంగా బొబ్బెర్లతో చేసిన కూరను తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. చర్మంపై ఉండే ముడతలను తొలగించడంలో కూడా ఇవి సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో బొబ్బెర్లు ఎంతో ఉపయోగపడతాయి.