Liver : ప్రస్తుత కాలంలో సాధారణ జలుబుకు కూడా మనం మందులను వాడుతున్నాం. ఈ మందుల తయారీలో అనేక రకాల రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఈ మందులను ఎంతైనా ఖర్చు చేసి కొనుగోలు చేస్తుంటాం. వాటి వాడిని మనం తాత్కాలిక ఉపశమనాన్ని పొందుతున్నాం. అయితే పైసా ఖర్చు లేకుండా మన ఇంటి పెరట్లో, ఇంటి పరిసరాలల్లో ఉండే మొక్కలను ఉపయోగించే మనం ఎన్నో రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు. రసాయనాలతో శరీరం మలినం కాకుండా ఉంటుంది. ఇలా మనకు వచ్చే అనేక రకాల వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు కలిగిన మొక్కలల్లో తుమ్మి మొక్క కూడా ఒకటి. దీనిని సంస్కృతంలో ద్రోణ పుష్పి మొక్క అని అంటారు.
గాలి, నీరు, ఆహారాల్లో ఉండే కాలుష్యాన్ని నివారించే శక్తి ఈ మొక్కకు ఉంది. తుమ్మి మొక్క పువ్వులతో శివున్ని పూజిస్తారు. వినాయక చవితి రోజూ వినాయకుడిని కూడా ఈ మొక్క పువ్వులతో పూజిస్తారు. తుమ్మి మొక్కను ఆహారంగా కూడా తీసుకుంటూ ఉంటారు. తుమ్మి మొక్క ఆకులతో కూరలను, పచ్చడిని, పప్పును తయారు చేస్తూ ఉంటారు. తేలు, పాము లేదా ఏదైనా విషపు పురుగులు కుట్టినప్పుడు తుమ్మి ఆకులను ముద్దగా చేసి కట్టుగా కట్టడం వల్ల విషం హరిస్తుంది. కాటుకు గురైన వ్యక్తి వయస్సును బట్టి ఆకుల రసాన్ని తాగించడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చు.
కామెర్ల వ్యాధిని నయం చేయడంలో తుమ్మి మొక్క ఎంతగానో సహాయపడుతుంది. తుమ్మి ఆకులను పెసరపప్పుతో కలిపి వండి తినడం వల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడి కామెర్ల వ్యాధి తగ్గు ముఖం పడుతుంది. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. కాలేయానికి తుమ్మి మొక్క ఆకులు అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు. కనుక లివర్ సమస్యలు ఉన్నవారు తుమ్మి మొక్క ఆకులను పప్పుతో కలిపి వండి తరచూ తింటుండాలి. దీంతో లివర్ శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక పక్షవాతం వచ్చిన వారికి తుమ్మి కూరను వండి ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల పక్షవాతం నుండి త్వరగా కోలుకుంటారు. తుమ్మి ఆకుల రసాన్ని తాగడం వల్ల విషపు జ్వరాలు, చలి జ్వరం వంటివి తగ్గుతాయి. చర్మ సంబంధమైన సమస్యలను తగ్గించడంలోనూ తుమ్మి ఆకుల రసం ఉపయోగపడుతుంది. ఈ ఆకుల రసంలో పసుపును కలిపి లేపనంగా చేసి రాయడం వల్ల గజ్జి, తామర, దురదలు, దద్దుర్ల వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
మధుమేహం, బీపీ, అధిక బరువు వంటి వాటిని తగ్గించడంలో కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది. తుమ్మి, తులసి, మారేడు, వేప ఆకులను సమానంగా తీసుకుని ఎండబెట్టి చూర్ణంగా చేసి భోజనానికి అర గంట ముందు ఒక టీ స్పూన్ చూర్ణాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగడం వల్ల షుగర్ వ్యాధి తగ్గుతుంది. ఇలా 40 రోజుల పాటు తాగడం వల్ల బీపీ కూడా నియంత్రణలోకి వస్తుంది. అధిక బరువు కూడా తగ్గుతారు. ఈ విధంగా తమ్మి మొక్కను ఉపయోగించడం వల్ల మనకు వచ్చే అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.