Green Moong Dal Laddu : మన శరీరానికి పెసలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి మనకు చలువ చేస్తాయి. దీని వల్ల శరీరంలో ఉండే వేడి మొత్తం తగ్గుతుంది. అలాగే వీటి వల్ల మనకు ప్రోటీన్లు బాగా లభిస్తాయి. కనుక శక్తి అందుతుంది. చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారాలను తినలేని వారు పెసలను తరచూ తింటే ప్రోటీన్లు, విటమిన్లు బాగా లభిస్తాయి. అందువల్లే ఆయుర్వేద వైద్యులు కూడా పెసలను తరచూ తినాలని చెబుతుంటారు. అయితే వీటితో ఎంతో రుచికరమైన లడ్డూలను తయారు చేసుకుని కూడా తినవచ్చు. ఇలా తయారు చేసుకున్న లడ్డూలను రోజుకు ఒకటి తిన్నా చాలు.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక పెసలతో లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసలతో లడ్డూలు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసలు – కప్పు, బెల్లం – కప్పు, పాలపొడి – అర కప్పు, బాదం, పిస్తా, జీడిపప్పు – పావు కప్పు (అన్నింటినీ చిన్న చిన్న పలుకుల్లా చేయాలి), యాలకుల పొడి – అర టీస్పూన్, నెయ్యి – అర కప్పు.
పెసలతో లడ్డూలు తయారు చేసే విధానం..
మందపాటి బాణలిలో పెసలు వేసి మధ్యస్థ మంటపై మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. తరువాత తీసి చల్లార్చాలి. అనంతరం పెసలను మెత్తని పొడిలా చేసుకోవాలి. అలాగే బెల్లాన్ని కూడా పొడి చేయాలి. ఇప్పుడు పెసర పిండిలో బెల్లం పొడి, యాలకుల పొడి, పాలపొడి వేసి కలపాలి. తరువాత కరిగించిన నెయ్యి, బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులను వేసి బాగా కలిపి లడ్డూల మిశ్రమంలా చేయాలి. అయితే లడ్డూల మిశ్రమంలా తయారు కాకపోతే మరికాస్త నెయ్యిని వేయవచ్చు. దీంతో మిశ్రమం తయారవుతుంది. దాన్ని లడ్డూలలా తయారు చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన పెసర లడ్డూలు తయారవుతాయి. వీటిని రోజుకు ఒకటి తిన్నా చాలు.. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.