Munagaku Karam Podi : మునగాలో ఉండే ఔషధ గుణాల గురించి ప్రతేక్యంగా చెప్పవలసిన పని లేదు. మన శరీరానికి మునగాకు చేసే మేలు అంతా ఇంతా కాదు. మునగాకులో విటమిన్ ఎ, విటమిన్ సి లతోపాటు కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగిన వాటిల్లో మునగాకు ఒకటి. ఆయుర్వేదంలో కూడా అనేక రకాల వ్యాధులను తగ్గించడంలో మునగాకును వాడుతారు. బాలింతలు ఆహారంలో భాగంగా మునగాకును తీసుకోవడం వల్ల పాలు ఎక్కువగా వస్తాయి.
బరువు తగ్గాలనేకునే వారికి, చర్మం, జుట్టు సమస్యలను తగ్గించడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో మునగాకు ఎంతో ఉపయోగపడుతుంది. బీపీని, షుగర్ ని అదుపులో ఉంచుతుంది. ప్రతి రోజూ మునగాకును తీసుకోవడం వల్ల రక్తహీనత నుండి బయట పడవచ్చు. శృంగార సామర్థ్యాన్ని పెంచడంలోనూ మునగాకు సహాయపడుతుంది. కనుక మునగాకును మనం ప్రతి రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి.
మునగాకుకు ఉండే వాసన, రుచి కారణంగా దీనిని తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. మునగాకుతో పొడిని తయారు చేసుకుని ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. దీంతో రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. లభిస్తాయి. ఇక మునగాకుతో పొడిని ఎలా తయారు చేసుకోవాలి, దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకు కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మునగాకు – ఒక కప్పు, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్స్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టేబుల్ స్పూన్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండు మిరపకాయలు – 10 నుంచి 15, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, చింతపండు – 50 గ్రా., వెల్లుల్లి రెబ్బలు – 10, ఉప్పు – రుచికి సరిపడా.
మునగాకు కారం పొడి తయారీ విధానం..
ముందుగా మునగాకును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో అర టేబుల్ స్పూన్ నూనె వేసి కాగాక ఆరబెట్టుకున్న మునగాకును వేసి తక్కువ మంటపై బాగా వేయించుకోవాలి. మునగాకు బాగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పల్లీలను, నువ్వులను వేరు వేరుగా వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి శనగపప్పు, మినప పప్పు, ధనియాలు, ఎండు మిరప కాయలు, వెల్లుల్లి రెబ్బలు ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి. ఇవి వేగాక జీలకర్ర, చింతపండు, రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, మునగాకును వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తరువాత ఒక జార్ లో వేసి మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పొడిని మూత ఉన్న డబ్బాలో వేసి గాలి తగలకుండా నిల్వ చేయాలి. వేడి వేడి అన్నంలో మునగాకు పొడి, నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా.. మునగాకులో ఉండే ఔషధ గుణాలు శరీరానికి లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. రోజూ అన్నంలో మొదటి ముద్ద ఈ పొడిని కలిపి తింటే అనేక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.