Fenugreek Plants : మనం ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే ఆకు కూరల్లో మెంతి కూర ఒకటి. మెంతి కూరను ఇంట్లో చాలా సులువుగా పెంచుకోవచ్చు. మెంతి కూరను పెంచడానికి మట్టి అందుబాటులో లేకున్నా నీటిలో కూడా మెంతి కూరను పెంచుకోవచ్చు. మెంతి కూరను చాలా తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. మెంతి కూర తక్కువ మట్టిలో కూడా సులభంగా పెరుగుతుంది. ముందుగా మట్టిలో మెంతికూరను ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.
మెంతులను మట్టిలో పెంచేందుకు మెంతులను ఒక రాత్రి అంతా లేదా 8 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న మెంతులను శుభ్రంగా కడిగి నీటిని పారబోసి పక్కకు పెట్టుకోవాలి. మెంతి కూరను మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలలో లేదా కుండీలల్లో పెంచుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాలలో పెంచుకునే వారు డబ్బాకు అడుగు భాగాన నీరు నిల్వ ఉండకుండా రంధ్రాలు చేసుకోవాలి. ఇప్పుడు మనం మాములుగా మొక్కలు పెంచే మట్టిని తీసుకుని డబ్బాలో లేదా కుండీలో వేయాలి. ఈ మట్టికి కంపోస్ట్ ఎరువును కూడా కలపవచ్చు. కంపోస్ట్ ఎరువును కలపడం వల్ల మెంతి కూరలో పోషకాల విలువ పెరుగుతుంది.
తరువాత ఈ మట్టిలో నీళ్లు పోసి తడిగా చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన మెంతులను మట్టిపై చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న మెంతులపై పలుచగా మట్టిని మళ్లీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న మట్టిపై కొద్దిగా నీటిని చల్లి కుండీ లేదా డబ్బాను కొద్దిగా ఎండ తగిలే ప్రాంతంలో ఉంచాలి. వీటిపై ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నీటిని నేరుగా పోయకుండా చెయ్యి సహాయంతో నీటిని చల్లుకోవాలి. మూడు రోజుల తరువాత ఆకులు రావడాన్ని మనం గమనించవచ్చు. మెంతికూరను మనకు కావలసిన పరిమాణంలో పెరిగిన తరువాత కట్ చేసి వంటల్లో వాడుకోవచ్చు.
ఇప్పుడు నీటిలో మెంతికూరను ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నానబెట్టిన మెంతులను తీసుకుని జల్లి గిన్నె లేదా అడుగు భాగంలో రంధ్రాలు ఉన్నటువంటి బుట్టలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న మెంతులపై కాటన్ వస్త్రాన్ని ఉంచి నీటిని చల్లి ఒక రోజంతా అలాగే ఉంచాలి. ఒక రోజు తరువాత మెంతుల నుండి మొలకలు రావడాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఒక పాత్రను తీసుకుని అందులో నీళ్లను పోసి జల్లి గిన్నె లేదా బుట్ట అడుగు భాగం ఈ నీళ్లకు తగిలేలా ఉంచాలి. ఈ నీళ్లను రెండు రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. మెంతుల మొలకలపై కూడా కాటన్ వస్త్రాన్ని ఉంచి నీటిని చల్లుకోవాలి.
ఇంట్లో బాగా వెలుతురు వచ్చే ప్రదేశంలో ఉంచి, కాటన్ వస్త్రం తడి ఆరిపోయినప్పుడల్లా నీటిని చల్లుకుంటూ ఉండాలి. 3 రోజుల తరువాత మొలకల నుండి ఆకులు రావడాన్ని మనం గమనించవచ్చు. నీటిలో పెరుగుదల మట్టిలో కంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మెంతికూరను మన ఇంట్లో సహజ సిద్దంగా పెంచుకోవచ్చు.
మెంతి కూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో మెంతికూర ఎంతో సహాయపడుతుంది. మెంతి కూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మగ వారిలో శుక్ర కణాల సంఖ్య పెరుగుతుంది. ఇంకా ఈ ఆకుకూర వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.