Pepper Roti : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న వంట ఇంటి దినుసుల్లో మిరియాలు ఒకటి. వీటిని తరచూ మనం అనేక రకాల వంటల్లో వేస్తుంటాం. మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి. అందువల్ల కారంకు ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే మిరియాలను ఉపయోగించి చపాతీలు తయారు చేసుకుని కూడా తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యకరం కూడా. కనుక మిరియాలతో చపాతీలను ఎలా తయారు చేయాలి.. అందుకు ఏమేం పదార్థాలు కావాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిరియాల చపాతీలు తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒకటిన్నర కప్పు, సోంపు గింజలు – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, వాము – అర టీస్పూన్, మిరియాలు – 10, ఇంగువ – చిటికెడు, పాలు – అరకప్పు, నూనె లేదా నెయ్యి – వేయించడానికి సరిపడా.
మిరియాల చపాతీలు తయారు చేసే విధానం..
బాణలిలో సోంపు, జీలకర్ర, వాము, మిరియాలు అన్నీ వేసి వేయించాలి. తరువాత వీటిని మిక్సీల వేసి మెత్తగా పొడి చేయాలి. గోధుమ పిండిలో ఇంగువ, మిరియాల పొడి మిశ్రమం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు పిండిని చిన్న ఉండల్లా తయారు చేయాలి. వాటిని చపాతీల్లా తయారు చేసుకోవాలి. అనంతరం వాటిని పెనంపై నెయ్యి లేదా నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. దీంతో రుచికరమైన మిరియాల చపాతీలు తయారవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఏదైనా కూర, పప్పు వంటి వాటితో కలిపి తినవచ్చు. ఇలా చపాతీలను తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యకరం కూడా. ఈ చపాతీల్లో సోంపు, జీలకర్ర, మిరియాలు ఉంటాయి కనుక వాటి ద్వారా మనకు ప్రయోజనాలు కలుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.