Sprouts Chaat : మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. రక్త హీనతతో బాధపడే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అజీర్తి సమస్యను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో మొలకెత్తిన విత్తనాలు ఎంతగానో దోహదపడతాయి. మొలకెత్తిన విత్తనాలను నేరుగా తినడమే చాలా మంచిది. కానీ వీటి రుచి కారణంగా కొంత మంది వీటిని నేరుగా తినడానికి ఇష్టపడరు. వీటిని తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపించరు. అలాంటి వారు మొలకెత్తిన విత్తనాలతో చాట్ ను తయారు చేసుకుని తినవచ్చు.
మొలకెత్తిన విత్తనాలతో చాట్ ను చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో, ఈ విత్తనాలలో ఉండే పోషకాల విలువ తగ్గకుండా, ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా మొలకెత్తిన పెసలతో చాట్‌ను ఎలా తయారు చేసుకోవాలి, దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకెత్తిన విత్తనాలతో చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మొలకెత్తిన పెసలు – ఒక కప్పు, తరిగిన పచ్చి మిర్చి – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, తరిగిన టమాటా ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మొలకెత్తిన విత్తనాలతో చాట్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయి తీసుకుని అందులో నూనె వేసి కాగాక, జీలకర్ర, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీటిని ఎక్కువగా వేయించకూడదు. 2 నిమిషాల తరువాత టమాటా ముక్కలను వేసి మరో నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత మొలకెత్తిన పెసలను, కొద్దిగా ఉప్పును వేసి మరో 4 నిమిషాల పాటు వేయించుకొని, చివరగా కొత్తిమీరను వేసి, కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా తయారు చేయడం వల్ల రుచిగా ఉండడమే కాకుండా మొలకెత్తిన విత్తనాలలో ఉండే పోషకాలు తగ్గకుండా ఉంటాయి. ఇందులో నిమ్మ రసాన్ని కూడా వేసుకోవచ్చు. పెసలతోనే కాకుండా ఇతర గింజలతో తయారు చేసిన మొలకలతో కూడా ఈ విధంగా చాట్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీంతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ లభిస్తాయి.