Protein Laddu : మనకు తినేందుకు అనేక రకాల గింజలు.. విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటినీ రోజూ తినడం కష్టమే. కానీ అన్నింటిని తింటేనే మనకు ప్రయోజనాలు కలుగుతాయి. వీటిన్నింటిలోనూ కామన్‌గా ఉండేవి ప్రోటీన్లు. ఇవి మన శరీరానికి రోజూ ఎంతగానో అవసరం. వీటితో మనకు శక్తి లభిస్తుంది. కండరాల నిర్మాణం జరుగుతుంది. కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీర పెరుగుదలకు, ఆరోగ్యానికి ప్రోటీన్లు ఎంతగానో అవసరం అవుతాయి. అయితే ఆయా గింజలు.. విత్తనాలు.. అన్నింటినీ రోజూ తింటేనే మనకు అధిక స్థాయిలో ప్రోటీన్లు లభిస్తాయి. మరి అన్నింటినీ ఒకేసారి ఎలా తినడం ? అంటే.. అందుకు ఓ ఉపాయం ఉంది. అదే ప్రోటీన్ లడ్డూ.
మనకు అందుబాటులో ఉన్న వివిధ రకాల గింజలు, విత్తనాలతో ఈ ప్రోటీన్ లడ్డూను తయారు చేసుకుని రోజుకు ఒకటి చొప్పున తినాలి. దీంతో మనకు పుష్కలంగా ప్రోటీన్లు లభిస్తాయి. దీని వల్ల శక్తి లభించి ఆరోగ్యంగా ఉంటారు. మరి ప్రోటీన్ లడ్డూను ఎలా తయారు చేయాలో.. దానికి కావల్సిన పదార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
ప్రోటీన్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – ఒక కప్పు, అవిసె గింజలు – పావు కప్పు, గుమ్మడి గింజల పప్పు – 2 టేబుల్ స్పూన్స్, బాదం పప్పు – 2 టేబుల్ స్పూన్స్, జీడి పప్పు – 2 టేబుల్ స్పూన్స్, పిస్తా పప్పు – 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము – పావు కప్పు, ఖర్జూర పండ్ల ముక్కలు – ఒక కప్పు, సోంపు గింజలు – ఒక టేబుల్ స్పూన్, యాలకులు – 4, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్.
ప్రోటీన్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే ఒక కళాయిలో నువ్వులను వేసి తక్కువ మంటపై వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక గిన్నెలోకి కానీ, ప్లేట్ లోకి కానీ తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో వేరు వేరుగా అవిసె గింజలను, గుమ్మడి గింజలను వేసి వేయించుకుని నువ్వులతో కలుపుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పల్లీలను వేసి వేయించుకుని పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత బాదం పప్పు వేసి వేగాక జీడి పప్పు, పిస్తా పప్పులను వేసి వేయించుకోవాలి. చివరగా సోంపు గింజలను, యాలకులను వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇవి పూర్తిగా చల్లారిన తరువాత.. ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలతో పాటుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నుండి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుని.. ఒక జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే జార్ లో నెయ్యి కాకుండా ముందుగా వేయించి పెట్టుకున్న వాటితో పాటుగా బెల్లం తురుము, ఖర్జూర పండ్ల ముక్కలను వేసి మెత్తగా పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి కానీ, ప్లేట్ లోకి కానీ తీసుకుని.. ముందుగా పలుకులుగా చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని, నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కావలిసిన పరిమాణంలో లడ్డూలలా తయారు చేసుకోవాలి. ఈ లడ్డూలు 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. రోజుకి ఒక లడ్డూను తిన్నా కూడా శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి. దీంతో శక్తివంతులుగా మారుతారు. ఆరోగ్యంగా ఉంటారు.