Menthikura Pappu : మెంతికూర ప‌ప్పును ఇలా చేస్తే చాలా బాగుంటుంది.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంత‌మ‌వుతాయి..!

Menthikura Pappu : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే ఆకుకూర‌ల్లో మెంతికూర ఒక‌టి. మెంతికూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మెంతికూర‌లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా దీనిని ఆహారంగా తీసుకోవ‌చ్చు. మెంతికూర‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో కూడా మెంతికూర స‌హాయ‌ప‌డుతుంది.

Menthikura Pappu is very healthy and tasty if you make it like this
Menthikura Pappu

నోటి పూత‌ల‌ను త‌గ్గించ‌డంలోపాటు, జీర్ణశ‌క్తిని పెంచ‌డంలోనూ మెంతికూర దోహ‌ద‌ప‌డుతుంది. బాలింత‌ల‌లో పాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేయ‌డంలోనూ మెంతికూర ఉప‌యోగ‌ప‌డుతుంది. మెంతికూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మెంతికూర ఆకుల‌ను ఎండ‌బెట్టి కూడా మ‌నం వంట‌ల్లో వాడుతూ ఉంటాం. మెంతికూర‌తో చేసే ప‌రోటాలు చాలా రుచిగా ఉంటాయి. మెంతికూర‌తో ఎంతో రుచిగా ఉండే ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మెంతికూర ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతికూర ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కంది ప‌ప్పు – ఒక క‌ప్పు, త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి స‌రిప‌డా, నీళ్లు – 2 క‌ప్పులు.

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒకటిన్న‌ర టేబుల్ స్పూన్‌, ఆవాలు – అర టీ స్పూన్‌, మిన‌ప ప‌ప్పు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ధ‌నియాలు – పావు టీ స్పూన్, మెంతులు – 8, క‌చ్చా ప‌చ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బ‌లు – 6, ఎండు మిర్చి – 2, త‌రిగిన ప‌చ్చి మిర్చి -3, త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, త‌రిగిన మెంతి కూర – ఒక క‌ట్ట (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), కారం – ఒక టీ స్పూన్‌, నాన‌బెట్టిన చింత‌పండు – 5 గ్రా., త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

మెంతి కూర ప‌ప్పు త‌యారీ విధానం.

ముందుగా కుక్క‌ర్‌లో శుభ్రంగా క‌డిగిన కందిప‌ప్పుతోపాటు ఉప్పు మిన‌హా ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నింటినీ వేసి మూత పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ప‌ప్పు ఉడికిన త‌రువాత రుచికి స‌రిపడా ఉప్పును వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి కాగాక మెంతికూర‌, కారం, చింత‌పండు, కొత్తిమీర త‌ప్ప మిగిలిన తాళింపు ప‌దార్థాల‌న్నీ వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపులో వేసిన ఉల్లిపాయ ముక్కలు ముప్పావు వంతు వేగాక త‌రిగిన మెంతి కూర‌ను వేసి బాగా వేయించుకోవాలి. నీరు అంతా పోయి మెంతికూర బాగా వేగాక కారం వేసి క‌లుపుకోవాలి. త‌రువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ప‌ప్పును, చింత‌పండు గుజ్జును వేసి క‌లుపుకోవాలి. ఇలా క‌లిపిన త‌రువాత 2 నిమిషాల పాటు ఉడికించి, చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి కలుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర ప‌ప్పు త‌యార‌వుతుంది. ప‌ప్పు ప‌లుచ‌గా ఉండాలి అనుకునే వారు కొద్దిగా నీటిని కూడా వేసుకోవ‌చ్చు. రొట్టె, చ‌పాతీ, అన్నం, రాగి సంగ‌టి వంటి వాటితో క‌లిపి ఈ ప‌ప్పును తింటే ఎంతో రుచిగా ఉండ‌డంతోపాటు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి.

D

Recent Posts