Mixed Vegetable Idli : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను తయారు చేస్తూ ఉంటాం. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. త్వరగా జీర్ణమవుతాయి. బరువు తగ్గడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఇడ్లీలను మరింత ఆరోగ్యవంతంగా, రుచిగా తయారు చేసుకోవచ్చు. ఇడ్లీలలో కూరగాయ ముక్కలను వేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు. కూరగాయ ముక్కలను వేసి ఇడ్లీలను మరింత ఆరోగ్యవంతంగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిక్స్ డ్ వెజిటెబుల్ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీ పిండి – రెండు కప్పులు, క్యారెట్ తురుము – ఒక కప్పు, చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – ఒక కప్పు, ఉప్పు – తగినంత.
మిక్స్ డ్ వెజిటెబుల్ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఇడ్లీ పిండిని తీసుకుని అందులో క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలను తయారు చేసే ప్లేట్ లను తీసుకుని వాటికి నూనెను కానీ నెయ్యి కానీ రాసి వాటిలో క్యారెట్, క్యాప్సికం వేసి కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని వేసి ఇడ్లీ పాత్రలో ఉంచి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిక్స్ డ్ వెజిటెబుల్ ఇడ్లీ తయారవుతుంది. వీటిని మరో విధంగా కూడా తయారు చేసుకోవచ్చు.
ఇడ్లీ ప్లేట్ లకు నూనె కానీ, నెయ్యి కానీ రాసి వాటిల్లో క్యారెట్ తురుమును, క్యాప్సికం ముక్కలను కొద్ది కొద్దిగా ఉంచి వాటిపై ఇడ్లీ పిండిని వేసి ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మిక్స్ డ్ వెజిటేబుల్ ఇడ్లీ తయారవుతుంది. వీటి తయారీలో మనం బీట్ రూట్ తురుమును కూడా ఉపయోగించవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఇడ్లీలపై కొద్దిగా నెయ్యిని వేసి పిల్లలకు నేరుగా పెట్టవచ్చు. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీలతో కలిపి తింటే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.